మాట్లాడుతున్న డాక్టర్ కూటికుప్పల సూర్యారావు
ఆరిలోవ(విశాఖతూర్పు): జైళ్లు దేవాలయాల్లాంటివని, అందులో పనిచేస్తున్న సిబ్బంది పూజారుల లాంటివారని ప్రముఖ వైద్యనిపుణుడు కూటికుప్పల సూర్యారావు తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో గురువారం రాష్ట్ర స్థాయి పునరశ్చరణ తరగతులు(ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్ స్టేట్ లెవెల్ రిట్రీట్–2017) ప్రారంభమయ్యాయి. ఈ తరగతులు రెండురోజులు జరగనున్నాయి. మొదటిరోజు కార్యక్రమంలో జైల్ శాఖ ఐజీ జయవర్ధన్, కోస్త ఆంద్రా డీఐజీ ఇండ్ల శ్రీనివాస్ సమక్షంలో వివిధ కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు, అధికారులు గత ఏడాది జైళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎదుర్కొనే సమస్యలు, ఖైదీల, సిబ్బంది కోసం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు గురించి చర్చించారు.
ఇంకా 2018లో ఏఏ కార్యక్రమాలు చేపట్టదలిచారో తదితర వాటి గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కూటికుప్పల ముఖ్యఅతిథిగా పాల్గొని జైల్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జైళ్లలో పనిచేయడం అదృష్టమన్నారు. నేరాలు చేసేవారిని సత్ ప్రవర్తన గల వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం జైల్ సిబ్బందికే లభించిందన్నారు. వీరిద్వారా మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. జైల్‌లో పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రత ఉన్నచోట ఆరోగ్యవంతమైన వాతావరణ లభిస్తుందన్నారు. పనిఒత్తడి అనేది సైలెంట్ కిల్లర్ అని, దాన్ని తగ్గించుకోవడానికి యోగా చేయడం మంచి విధానమని సూచించారు. ఖైదీలలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో బిహేవియర్ థెరిపిస్టులు, సైకాలజిస్టులను నియమించాలన్నారు. కార్యక్రమంలో విశాఖ జైల్ సూపరింటెండెంట్ ఎస్.రాహుల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.సన్యాసిరావు, పలు కేంద్రాకారాగారాల సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment