సాక్షి, కడప : పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది.ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 20వతేదీ. ఎన్నికలను రెండు విడతల్లో ఏప్రిల్ 6,8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ,559 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. 13,39,317 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
1868 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జెడ్పీటీసీ అభ్యర్థులు కడప జెడ్పీకార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వీలుగాడివిజన్‌కు ఒకటి చొప్పున మూడు కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులుగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, ఏజేసీ సుదర్శన్ రెడ్డి, డీపీఓ అపూర్వ సుందరిని నియమించారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల కార్యాలయాలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. మండల ప్రత్యేక అధికారులనే అయా మండలాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. నామినేషన్ నమూనా పత్రాలు ఇప్పటికే అన్ని మండల కార్యాలయాలకు చేరాయి.. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో రాజకీయ పార్టీ నేతలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు.
సత్తా చాటుకునేందుకు..
ప్రాదేశిక పోరులో సత్తా చాటుకోవటం ద్వారా సాధారణ ఎన్నికలకు ముందే తమ బలాన్ని చూపాలన్న వ్యూహంలో పార్టీలు ఉన్నాయి. బలమైన అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో దింపాలనే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రాదేశిక పోరుపై దృష్టి సారించారు. మండలాల వారీగా గ్రామ స్థాయి నేతలతో నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలు,ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తూ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిషత్ చెర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థి వేటలో పడ్డాయి. మొత్తం మీద సార్వత్రిక సమరంతో పాటు ముంచుకొచ్చిన స్థానిక ఎన్నికలు ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారాయి. తమ నియోజక వర్గాల పరిధిలో పట్టు నిలుపుకునేందుకు, అధిక సంఖ్యలో తమ అనుచరులను గెలుపొందించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఏర్పాట్లు సిద్దం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
స్థానిక సమరానికీ సై
Published Mon, Mar 17 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement