పైరవీలకు అవకాశం
ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో ప్రక్రియ
దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్న ఉద్యోగులు
రాజకీయాలకు అతీతంగా బదిలీలు చేయాలంటున్న ఉద్యోగ సంఘాల నేతలు
కర్నూలు(అగ్రికల్చర్) : ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధం అయింది. ఇందులో రాజకీయాలదే పైచేయిగా ఉండే అవకాశం ఉంది. దీంతో బదిలీల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది భూమి రికార్డులు, సర్వే డిపార్ట్‌మెంట్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ, ఐసీడీఎస్, పశుసంవర్ధక శాఖలో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి.
ఈసారి కూడా బదిలీలను రాజకీయాలతో ముడిపెట్టడంతో అవకతవకలు భారీగా జరిగే వీలుందనే విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట రెండేళ్లు పైబడి పనిచేస్తున్నవారిని కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి అవకాశం కల్పించడమే అవకతవకలకు అవకాశం కలిగిస్తుంది. అంతేకాక బదిలీల ప్రక్రియ ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో జరగనున్నందున ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ నేతల హవా ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులు దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు కౌన్సెలింగ్ విధానాన్ని చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలుకుతుంది.
రాజకీయాలకు అతీతంగా బదిలీలు జరగాలి
ఉద్యోగుల బదిలీల్లో రాజకీయాల ప్రమేయం ఏమాత్రం ఉండరాదు. గతేడాది బదిలీల్లో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగింది. ఈసారి కూడా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే మళ్లీ అదే పరిస్థితి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగేలా ఉత్తర్వులు ఉండటం అనుమానాలకు కారణం.
- శ్రీరాములు, కార్యదర్శి,జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్
పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి
ఉద్యోగుల బదిలీలు 100 శాతం పారదర్శకంగా జరగాలి. రాజకీయాలకు బదిలీలతో సంబంధం లేకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలిస్తే అవకతవకలకు అవకాశం ఏర్పడుతోంది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు జరగాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.
- టి.ఎం.డి.హుసేన్, అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్
అవకతవకలకు అవకాశం కల్పించరాదు
గజిటెడ్, ఆపై స్థాయి అధికారుల బదిలీలకు కౌన్సెలింగ్ లేకుండా బదిలీ చేయనుండటం వల్ల భారీగా అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగే విధంగా ఉత్తర్వులు ఉండటం అందులో రాజకీయ ప్రమేయాన్ని సూచిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పైరవీలు ఉండే అవకాశం ఉంది.
- డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సంఘం
బదిలీలకు రంగం సిద్ధం
Published Wed, May 20 2015 4:14 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement