అక్రమ ఇసుకపై.. దాడులకు రెడీ! | Ready to attack illegal sand ..! | Sakshi
Sakshi News home page

అక్రమ ఇసుకపై.. దాడులకు రెడీ!

Published Sat, Nov 22 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

Ready to attack illegal sand ..!

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి అక్రమ ఇసుక నిల్వలపై దాడులు నిర్వహించి సీజ్ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సీజ్ చేసుకున్న నిల్వలను ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్‌ల వద్దకు వెంటనే తరలించాలని కూడా యోచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇసుక నిల్వలు అక్రమంగా దాచి ఉంచారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఒకసారి రహస్యంగా సర్వే చేసిన అనంతరం.. దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఒకసారి నందికొట్కూరులో ఇటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈసారి మరింత జాగ్రత్తగా ‘ఆపరేషన్ అక్రమ ఇసుక’ చేపట్టాలనేది అధికారుల భావనగా ఉంది.

 జాయింట్ ఆపరేషన్..!
 రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పాటు ఉమ్మడిగా దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయనే విషయంలో మూడు శాఖల అధికారులు కలిసి చర్చించారు. అక్రమ నిల్వలు ఉన్న ప్రాంతాలపై ఏకకాలంలో సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేయాలని భావిస్తున్నారు. సీజ్ చేసిన ఇసుకను జిల్లా మహిళా సమాఖ్య సహాయంతో ట్రాక్టర్లు, లారీల ద్వారాఅక్రమ ఇసుకపై.. దాడులకు రెడీ! వెంటనే ఇప్పటికే గుర్తించిన నాలుగు ఇసుక రీచ్‌ల (నిడ్జూరు, జి. శింగవరం, మంత్రాలయం, పూడురు)కు చేరవేయాలని ప్రణాళిక రచించారు.

అంతేకాకుండా ఆ ఇసుక రీచ్‌ల నుంచి కూడా మళ్లీ ఇసుక తరలిపోకుండా.. చుట్టూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయుధాలతో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది (ఆర్మ్‌డ్ సెక్యూరిటీ)ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీసీ టీవీలు, సెక్యూరిటీ సిబ్బంది కోసం అధికారులు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు.

 రీచ్‌లల్లో ఏవీ నిల్వలు..
 ఇసుక పాలసీ-2014 కింద ఇసుక అమ్మకాలను మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో నాలుగు రీచ్‌లను గుర్తించారు. అయితే, ఈ ప్రక్రియ ముగిసే సమయానికే రీచ్‌ల్లోని ఇసుక నిల్వలను మాఫియా మొత్తం తవ్వుకుని తరలించి అక్రమంగా నిల్వ చేసుకుంది. తీరా మహిళా సంఘాలకు అప్పగించే సమయానికి నిల్వలు లేకుండా పోయిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు ఇసుక రీచ్‌ల వద్ద కలిపి మొత్తం కేవలం 8,27,467 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు మాత్రమే ఉన్నాయి.

వాస్తవంగా ఉన్న డిమాండ్‌కు ఈ నిల్వలు ఏ మాత్రమూ సరిపోని పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్రమంగా ఉన్న ఇసుక నిల్వలు వీటికి నాలుగైదు రెట్ల మేరకు ఉంటుందనేది అధికారులు అంచనా. అయితే, వాస్తవంగా అంతకంటే ఎక్కువగా ఉంటుందనే వాదన కూడా ఉంది. ఈ నిల్వలను పెంచుకునేందుకు ఇప్పటికే నందికొట్కూరు ప్రాంతంలో భారీగా ఉన్న నిల్వలపై దాడులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న అక్రమార్కులు ఇసుక నిల్వలను హైదరాబాద్‌కు వే బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు.

ఈ వ్యవహారంలో ఇటు పోలీసులతో పాటు అటు మైనింగ్ అధికారులకు భారీగా మామూళ్లు ముట్టుతుండటంతో కిమ్మనకుండా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీ కలిగిన అధికారులతో కలిసి ‘ఆపరేషన్ అక్రమ ఇసుక’ను చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశారు.

 రీచ్‌ల్లో తవ్వే పరిస్థితీ లేదు...!
 వాస్తవానికి ఇసుక డిమాండ్ మేరకు సరఫరా చేసేందుకు వీలుగా నిల్వలు పెంచుకునేందుకు వీలుగా రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఈ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయి. ఈ రీచ్‌లన్నీ అంతర్ రాష్ర్ట పరిధిలోకి వస్తున్నాయి. అయితే, అటు కర్నాటక లేదంటే తెలంగాణ రాష్ర్టంతో కలిసి ఉన్నాయి. ఈ రీచ్‌ల్లో తవ్వకాలు చేపట్టాలంటే ఆయా రాష్ట్రాల అనుమతులు కూడా తప్పనిసరి.

మరోవైపు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర అటవీ పర్యావరణశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ఇప్పటివరకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా లభించలేదు. ఈ విధంగా అంతర్ రాష్ర్ట, పర్యావరణ అనుమతుల లేమి ఇబ్బందులతో అడుగు ముందుకు వేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అనుమతులు వచ్చేలోగా అక్రమ ఇసుక నిల్వల భరతం పట్టాలనేది అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ ప్రయత్నాలు ఇసుక మాఫియా ముందు ఏ మేరకు ఫలిస్తాయనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement