కసరత్తు | Ready to elections | Sakshi
Sakshi News home page

కసరత్తు

Published Mon, Mar 10 2014 2:33 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

Ready to elections

సాక్షి, కడప: ఎన్నికల జాతర మొదలైంది. రాజకీయ పదవుల కోసం ఉగ్గ పట్టిన ఆశావహుల ‘కల’ నెరవేరే సమయం అసన్నమైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. బరిలో నిలవాలని ఉత్సాహం చూపుతున్న అభ్యర్థులు  టిక్కెట్‌లు దక్కించుకునేందుకు తమ గాడ్ ఫాదర్‌ల చుట్టూ తిరుగుతూ  ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
 
 కడప కార్పొరేషన్‌తో పాటు, కొన్ని మున్సిపాలిటీలలో వైఎస్సార్‌సీపీ  అభ్యర్థుల ఎంపిక  ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.  ఇప్పటికే గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావడం  ఆ పార్టీకి అదనంగా కలిసొచ్చే అంశం. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున  ఎన్నికలకు సమాయత్తం చేసే నాయకుడు  కనుచూపు మేరలో కనిపించడం లేదు, ఆ  పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. తెలుగుదేశం పార్టీలో సైతం  ఆసక్తి చూపే వారు అంతంత మాత్రమే.
 క్షేత్ర స్థాయిలో ప్రచారం కష్టమే...
 మున్సిపల్ అభ్యర్థుల ఖరారు పూర్తయ్యాక  జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి. మళ్లీ అసెంబ్లీ, లోక్‌సభ  కోసం కసరత్తు చేయాలి. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు తమ అభ్యర్దుల పక్షాన జనంలోకి వచ్చి ప్రచారం చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే నేతలు క్షేత్ర స్థాయి వరకు వెళ్లేవారు. సామాజిక వర్గాల వారీగా చర్చలు జరిపేవారు. పార్టీ అధినాయకులు రోజుల తరబడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించేవారు. ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకే సమయం సరి పోతుండటంతో పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది.
 
 వణికి పోతున్న నేతలు...
 నిన్న మొన్నటి వరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన రాజకీయ నేతలు ఇప్పుడు ఆపేరు చెబితేనే వణికి పోతున్నారు. సాధారణ ఎన్నికలకు సిద్దమవుతున్న  రాజకీయ పార్టీల నేతలు మధ్యలో మున్సిపల్ ఎన్నికలు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో వారి పరిస్థితి  మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా  మారింది.
 
 తలకు మించిన భారం...
 ఎమ్మెల్యే  అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు  తలకు మించిన భారంగా మారాయి.. అభ్యర్థులను ఎంపిక చేయడం ఓ ఎతైతే వ్యూహ ప్రతి వ్యూహలను సైతం పన్నేందుకు వారికి సమయం లేకుండా పోతోంది. సాధారణంగా ఈ మూడు ఎన్నికలకు వేర్వేరు వ్యూహలు ఉండాలి. అలా వ్యూహలు పన్నేందుకు నేతలకు సమయం దొరకడంలేదు.
 
 మోగనున్న నగారా...
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల నగారా మోగనుంది. ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement