
సాక్షి, అమరావతి: ఇంటికి పునాది పనులు పూర్తి అయ్యాక.. గృహనిర్మాణం అయిపోయినట్లేనని హడావుడి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర అలాంటి హడావుడి చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు షో చేయడానికి సీఎం చంద్రబాబు తెరతీస్తున్నారు. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తిచేయడంలో వైఫల్యాన్ని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మరో ‘రియాలిటీ షో’ చేయబోతున్నారు.
హెడ్ వర్క్స్(జలాశయం)లో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్–రాతి మట్టి కట్ట) నిర్మాణంలో పునాది (డయాఫ్రమ్ వాల్) పనులు సోమవారం నాటికి పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పునాది పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా పైలాన్‌ను ఆవిష్కరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా.. కృష్ణా, విశాఖపట్నం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పైలాన్ ఆవిష్కరణ సభకు రూ. 3.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు జలవనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పునాది పనులే పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పట్టిందంటే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతుంది. హెడ్‌వర్క్స్‌లో 45 డిజైన్లకు గాను ఇప్పటివరకు కేవలం 14 డిజైన్లను మాత్రమే కేంద్ర జలసంఘం ఆమోదించింది.
మిగిలిన 31 డిజైన్లను రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించి, నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ‘స్పెషల్ పర్సస్ వెహికల్’గా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను ఏర్పాటు చేసింది.
ట్రాన్స్‌ట్రాయ్‌ను ముందుపెట్టి..
రూ.4,054 కోట్లకు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కాంట్రాక్టును టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ దక్కించుకుంది. పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదని పీపీఏ సీఈవోగా ఉన్న సమయంలో దినేష్‌కుమార్ తేల్చిచెప్పారు. అయినా ట్రాన్స్‌ట్రాయ్‌పై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఎంపీ రాయపాటిని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్‌లు కాజేయాలన్న ఎత్తుగడలో భాగంగా పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ కమీషన్ల కోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. 2016, సెప్టెంబర్ 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ. 5,535.41 కోట్లు పెంచేశారు.
వర్చువల్ రివ్యూలతో షోలు..
హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు త్రివేణి కంపెనీకి, డయాఫ్రమ్ వాల్ పనులు ఎల్ అండ్ టీ–బావర్, కాంక్రీట్ పనులు పెంటా, ఫూట్జ్‌మీస్టర్‌లకు అప్పగించారు. ఆ వెంటనే 2016, సెప్టెంబర్ 12న ప్రతి సోమవారం వర్చువల్ రివ్యూల ద్వారా పనులను సమీక్షిస్తానని చంద్రబాబు ప్రకటించారు. వారం వారం కమీషన్ల వసూళ్లకే వర్చువల్ రివ్యూ పేరుతో షో చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 2016, డిసెంబర్ 26న ఢిల్లీ వేదికగా రియాలిటీ షోకు తెరతీశారు.
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1,981.54 కోట్లను కేంద్రం విడుదల చేసినప్పుడే పనులన్నీ పూర్తయినట్లుగా ప్రజలను భ్రమింపజేసేలా సీఎం చంద్రబాబు డ్రామా చేశారు. 2016, డిసెంబర్ 30న హెడ్ వర్క్స్‌లో కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవాన్ని భారీగా నిర్వహించారు. దీని తర్వాత గేట్ల తయారీ పనులను బీకెమ్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి కమీషన్‌లు దండుకున్నారు.
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి 2017, సెప్టెంబరు 27న గేట్ల తయారీ పనులను ఘనంగా ప్రారంభించారు. ఆ వెంటనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి వీలుగా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనుల్లో పునాది (జెట్ గ్రౌటింగ్) పనులను కెల్లర్ అనే సంస్థకు నామినేషన్‌పై అప్పగించి జేబులు నింపుకున్నారు. ఆ తర్వాత 2017, జూన్ 8న కాఫర్ డ్యామ్ పనులకు శంకుస్థాపనను భారీ ఎత్తున నిర్వహించారు.
తర్వాత హెడ్ వర్క్స్‌లో స్పిల్‌వే, స్పిల్ చానల్‌లో రూ. 2,165.54 కోట్ల విలువైన పనులను నవయుగ కంపెనీకి నామినేషన్‌పై కట్టబెట్టారు. తాజాగా సుమారు రూ. 2,400 కోట్లకు పైగా విలువైన ఎర్త్‌కం రాక్ ఫిల్‌డ్యాం పనులను కూడా రత్న ఇన్‌ఫ్రా అనే సంస్థకు నామినేషన్ పద్ధతిపై అప్పగించడానికి సీఎం చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు సమాచారం.
నాలుగేళ్లలో 18.06 శాతం మాత్రమే పనులు..
పోలవరం ప్రాజెక్టు పనులను 63 సార్లు వర్చువల్ రివ్యూలు.. 24 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకూ మొత్తం 54.73 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు జలవనరుల శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఇందులో 39.67 శాతం పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. అంటే నాలుగేళ్లలో కేవలం 18.06 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు స్పష్టమవుతోంది. 2018 ఖరీఫ్ వచ్చేసింది.
తాను ఇచ్చిన హామీ నీరుగారిపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి పునాది పనులు 1,397 మీటర్లు చేయాల్సి ఉండగా.. గడిచిన సోమవారం నాటికి 1378.60 మీటర్లు పూర్తయ్యాయి. మిగిలిన 18.40 మీటర్లు ఈనెల 11 నాటికి పూర్తవుతాయని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు. పునాది పనులు పూర్తవడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్టుగా మాయ చేసేందుకు భారీ పైలాన్‌ను ఆవిష్కరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబారా చేస్తుండటంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు.
డయాఫ్రం వాల్ అంటే...
పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిలో ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీరు దిగువకు లీకేజి కాకుండా ఉండటానికి.. భూకంప ప్రభావిత ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నందున పునాదిని పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది. దీంతో డయాఫ్రం వాల్ విధానంలో పునాదిని నిర్మించాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. డాగర్లు, గ్రాబర్లు అనే యంత్రాలతో పునాదిని గట్టి రాతిపొర వచ్చేవరకు తవ్వుకుంటూ పోతారు. మట్టిని తవ్విన ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతారు.
రాతిపొర వచ్చిన తరువాత అధిక పీడనంతో కాంక్రీటు మిశ్రమాన్ని లోపలికి పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం పైపుల ద్వారా బయటకు వస్తుంది. సుమారు 8 నుంచి 10 శాతం బెంటనైట్ మిశ్రమం కాంక్రీటుతో కలిసి పోతుంది. బెంటనైట్, కాంక్రీటు మిశ్రమం కలవడం వల్ల ప్లాస్టిక్ కాంక్రీటుగా రూపాంతరం చెందుతుంది. ఇది అత్యంత పటిష్టంగా ఉంటుంది. చుక్కనీటిని బయటకు రానీయదు. భూకంపాలు వచ్చినా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లదు. ఈ విధానంలో నిర్మించే పునాది గోడనే డయాఫ్రం వాల్ అంటారు. దీనిని నదీ ఉపరితలం వరకు నిర్మిస్తారు.
ఇది ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పని మాత్రమే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పునాది పనులను చేయడానికే నాలుగేళ్ల సమయం తీసుకుంది. ఇప్పుడు దీన్నే సోమవారం సీఎం చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేస్తారు. ఎక్కడైనా, ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, ఆయకట్టుకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయడం సంప్రదాయం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం ప్రాజెక్టు పునాది గోడను జాతికి అంకితం చేస్తుండటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment