సాక్షి, అమలాపురం: ఆయన నిన్నటి వరకు రాజకీయ జీవితాన్నిచ్చిన గురువు. ఈయన గురువు అడుగుజాడల్లో నడిచే శిష్యుడు. కానీ రాజకీయాల్లో ఇటువంటివి తాత్కాలికమే కానీ...శాశ్వతం కాదని మరోసారి రుజువయింది. దీంతో శిష్యునికి టిక్కెట్ రాకుండా గురువు ప్రయత్నిస్తే..గురువును కాదని టిక్కెట్ తెచ్చుకున్న శిష్యుడు. ఇటువంటప్పుడు సర్వసాధారణంగా జరిగేది గురువు వైపు కొందరు..శిష్యుడు వైపు మరికొందరుగా గ్రూపులుగా ఏర్పడడం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవాలని చూడడం సర్వసాధారణం. ఇలా గురు, శిష్యుల పోరుతో అమలాపురం అసెంబ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగుదేశం పార్టీని పుట్టి్టముంచనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గురువు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అయితే.. శిష్యుడు అయితాబత్తుల ఆనందరావు. ఎమ్మెల్యే ఆనందరావుపై నియోజకవర్గంలో ఆ పార్టీలోనే అసంతృప్తి ఉంది. అల్లవరానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో అమలాపురం అసెంబ్లీ నుంచి కొత్తవ్యక్తిని పోటీ చేయించాలని ఉప ముఖ్య మంత్రి చినరాజప్ప గట్టి ప్రయత్నాలే చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనందరావు స్థానంలో ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్‌కు అవకాశం కల్పించాలని, లేదంటే పార్టీలోనే మరొకరికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అందుకు తగినట్టుగా వూహ్యాలు రచించారు. ఎన్నికల ముందు జరిగిన కొన్ని పరిణామాలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మరీ ముఖ్యంగా తన తమ్ముడు జగ్గయ్యనాయుడుపై మీడియాలో వచ్చిన కథనాల వెనుక ఆనందరావు హస్తం ఉందని రాజప్ప ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందని అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య స్థాయిలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లోను ఆనందరావుకు అవకాశం రాదని టీడీపీ క్యాడర్ భావించింది. కానీ నియోజకవర్గ సమన్వయ కమిటీ పార్టీ ఆధిష్టానంపై ఒత్తిడి చేసి ఆనందరావును తమ అభ్యర్థిగా చేసుకుంది.
ముఖ్యంగా పట్టణానికి చెందిన మెట్ల రమణబాబు అతని వర్గీయులు పట్టుబట్టి ఆనందరావుకు టిక్కెట్ వచ్చేలా చేశారు. తద్వారా నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇదే సమయంలో అమలాపురంలో తనను కాదని పార్టీ ఆనందరావుకు టిక్కెట్ ఇవ్వదని భావించిన రాజప్పకు ఇది షాక్ అనే చెప్పాలి. తన మాట జవదాటని సమన్వయ కమిటీలో మెజార్టీ సభ్యులు ఆనందరావు వెనుక నిలబడడం, తీవ్ర జాప్యం తరువాత అధిష్టానం ఆనందరావును అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజప్ప నియోజకవర్గంపై పట్టుకోల్పోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు రాజప్ప వర్గీయులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఆనందరావుకు టిక్కెట్ వచ్చినందుకు జరిగిన సంబరాల్లో రాజప్ప పేరు మచ్చుకైనా వినిపించలేదు. అతని సోదరుడు జగ్గయ్యనాయుడు, అతని వర్గీయులు ఈ సంబరాలకు దూరంగానే ఉన్నారు.
ఇవన్నీ చూస్తుంటే అమలాపురం అసెంబ్లీ పరిధిలోని టీడీపీలో అసమ్మతి చాపకింద నీరులా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో రాజప్ప వర్గీయులు అభ్యర్థి ఆనందరావుకు ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందిస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనిని గుర్తించిన ఆనందరావు నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజప్ప, అతని సోదరుడు జగ్గయ్యనాయుడుతో మంతనాలు చేపట్టారు. మంగళవారం రాత్రి పెద్దాపురం వెళ్లిన ఆనందరావు రాజప్పను కలిసి గతంలో జరిగిన పరిణామాల్లో తన ప్రమేయం లేదని వివరణ ఇవ్వడంతోపాటు తనను ఆశీర్వదించాలని కోరినా పెద్దగా ఫలితం లేదని తెలిసింది. ‘అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నిన్ను గెలిపించాలని పార్టీ నాయకులకు చెబుతాను. నేను ఇక్కడ అభ్యర్థిని కాబట్టి నీ వెంట నేను ప్రచారానికి రాలేను’ అని చినరాజప్ప తేల్చిచెప్పేశారు.
అన్నయ్యతోపాటు పెద్దాపురంలో ఉంటాను, నీ వెంట ఉండలేనని జగ్గయ్యనాయుడు కూడా కుండబద్దలు కొట్టడంతో నిరాశగానే వెనుతిరగాల్సి వచ్చింది. మరోవైపు ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురంలో ఆనందరావుపై అసంతృప్తితో ఉన్న కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. ఇది పార్టీకి మరింత తలనొప్పిగా మారనుంది. జరుగుతున్న ఈ పరిణామాలతో పోరాడి టిక్కెట్ తెచ్చుకున్నాననే ఆనందం అభ్యర్థి ఆనందరావుకు లేకుండాపోయింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని సర్ధిచెప్పినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment