పోలవరంపై వారంలోగా ఆర్‌ఈసీ భేటీ | REC Meeting on Polavaram in a week | Sakshi
Sakshi News home page

పోలవరంపై వారంలోగా ఆర్‌ఈసీ భేటీ

Published Tue, Sep 17 2019 5:53 AM | Last Updated on Tue, Sep 17 2019 8:44 AM

REC Meeting on Polavaram in a week - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించడానికి వారంలోగా రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ) సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఢిల్లీలో యూపీ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి నాలుగు అంశాలపై ఆర్‌ఈసీ వ్యక్తంచేసిన సందేహాలను నివృత్తి చేస్తూ సమగ్ర నివేదికను దాస్‌ అందజేశారు.

సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) ఆమోదించిన డిజైన్‌ ప్రకారమే 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మిస్తున్నామని.. అలాగే, కుడి.. ఎడమ కాలువల సామర్థ్యం 17 వేల క్యూసెక్కులకు పెంచడంవల్ల పనుల పరిమాణం పెరిగిందని వివరించారు. మొదట్లో టోఫోగ్రాఫికల్‌ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని సర్వే చేయడంవల్ల ఎంత భూమిని సేకరించాలనే అంశంపై స్పష్టతలేదని.. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో సర్వేచేసి, ముంపునకు గురయ్యే భూమిని గుర్తించామని, దీనివల్ల సేకరించాల్సిన భూ విస్తీర్ణం పెరిగిందని వివరించారు.

2013 భూసేకరణ చట్టంవల్లే పరిహారం పెరిగింది
కాగా, 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక 18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితుడిని ఒక కుటుంబంగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనివల్లే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయం రూ.2,934.42 కోట్ల నుంచి రూ.32,509.28 కోట్లకు పెరిగిందన్నారు. దీనిపై యూపీ సింగ్‌ స్పందిస్తూ.. వారంలోగా ఆర్‌ఈసీ సమావేశాన్ని ఏర్పాటుచేసి, పోలవరం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద నిర్వహిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌పై యూపీ సింగ్‌ ఆరా తీశారు. జలవిద్యుత్‌ కేంద్రం పనులపై కాంట్రాక్టర్‌ హైకోర్టును ఆశ్రయించారని దాస్‌ బదులిచ్చారు. అక్టోబర్‌ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తయవుతుందని.. హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, రివర్స్‌ టెండరింగ్‌ పూర్తయిన తర్వాత వివరాలు ఇవ్వాలని యూపీ సింగ్‌ సూచించగా అందుకు ఆదిత్యనాథ్‌ దాస్‌ అంగీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement