‘తెలంగాణ ప్రజల కల నెరవేరుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యమకారులుగా సంతృప్తితో ఉన్నాం.. అదే ఉద్యమస్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం పునర్నిర్మాణంపై దృష్టి పెడతాం. కొత్త రాష్ట్రంలో, కొత్త లక్ష్యాలతో ప్రజల సమస్యలను దూరం చేయడం కోసం శ్రమిస్తాం’ అని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు(జీవీ) పేర్కొన్నారు.
రాష్ర్టం ఏర్పాటుపై ప్రకటన వెలువడడం, మరో నాలుగు నెలల్లోపే కొత్త రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉండడంతో జిల్లా పునర్నిర్మాణంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు, ఎలా ముందుకు సాగనున్నారన్న దానిపై ఆయన ‘సాక్షిప్రతినిధి’తో తన అభిప్రాయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగర్ ఉన్నా, అది కేవలం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రైతాంగానికే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మరిన్ని ఎగువ ప్రాంతాలకు అందించే పథకాలపై దృష్టి పెడతాం. ఇప్పటికే జిల్లాకు చెందిన రిటైర్డు ఇంజనీర్లు ఈ విషయంలో కొంత కృషి చేశారు.
ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసుకోవడం, నక్కలగండి ఎత్తిపోతల, కొత్తగా పాలమూరు ఎత్తిపోతల పథకాలు త్వరగా సాకారమయ్యేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాజెక్టుల రూపకల్పనకే ఎంతో సమయం తీసుకుని, ఆ తర్వాత బడ్జెట్ విడుదలలో తీవ్ర వివక్ష చూపుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తి స్థాయిలో అందించేందుకు అవకాశం ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌బెల్టు అభివృద్ధి
ఇక, జిల్లాలో పర్యావరణం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. కృష్ణానదీ తీరంలోని సిమెంటు పరిశ్రమలు, మూసీ నది వల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల వల్ల పూర్తిస్థాయిలో కాలుష్యం జిల్లాను కమ్ముకుంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, గ్రీన్‌బెల్టు అభివృద్ధికి జిల్లా పునర్నిర్మాణంలో తగిన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. వెనుకబడిన దేవరకొండ వంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేందుకు కొత్త రాష్ర్ట్రంలో వీలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయడం ద్వారా అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావచ్చని మా ఆశాభావం.
మెడికల్ కాలేజీ కల సాకారమవుతుంది..
విద్యాపరంగా జిల్లాకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉన్నా ఇప్పటి వరకు సరైన నిధుల్లేవు, సరిపోను ఫ్యాకల్టీ లేదు, పేరుకు మాత్రమే యూనివర్సిటీగా ఉంది. సొంత రాష్ట్రంలో ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరవుతుందని ఎందో ఆశపడ్డారు కానీ, చివరి నిమిషంలో రాకుండా చేశారు. ఇపుడు కొత్త రాష్ర్ట్రంలో ఇలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లా మెడికల్ కాలేజీ కలను నిజం చేసుకోవచ్చు. బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.
ఫ్లోరైడ్ సమస్యపై ప్రత్యేక దృష్టి..
ఏడు దశాబ్దాలుగా జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఇప్పటి దాకా జరిగిన కృషి అంతంత మాత్రమే. అంతర్జాతీయస్థాయిలో చర్చకూడా జరిగింది. అయినా, ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడలా కాదు. కృష్ణా జలాలను ఆ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో అందించడం ద్వారా ఈ సమస్య మూలాలపై యుద్ధం చేయొచ్చు. పునర్నిర్మాణంలో ప్లాన్ చేసిన సాగునీటి ప్రాజెక్టులతో ఈసమస్యకు పరిష్కారం లభిస్తుంది.
జిల్లాలో డిగ్రీ చదువు పూర్తిగా ప్రైవేటు, లేదా ఎయిడెడ్ కాలేజీలకే పరిమితం అయ్యింది. కానీ, కొత్త రాష్ట్రంలో నియోజకవర్గ కేంద్రానికి ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసేలా కృషి చేయాల్సి ఉంది. దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. చిన్న రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది. అలా, కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ర్ట్రంలో జిల్లా అదే తరహాలో సమగ్రమైన అభివృద్ధిని సాధించి తీరుతుంది. ఈ మేరకు పునర్నిర్మాణ ప్రకియలో లబ్ధి పొందేందుకు అంతా శ్రమిస్తాం.
పునర్నిర్మాణంతో.. జిల్లా పురోగతి
Published Sun, Aug 11 2013 2:01 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement