ఖజానాకు కిక్
- 328 మద్యం షాపులకు 5835 దరఖాస్తులు
- చివరిరోజు అత్యధికంగా 5431 దాఖలు
- మూడింతలు పెరిగిన దరఖాస్తుల ఫీజు
- గతేడాది రూ.8.25కోట్లు.. ఈ ఏడాది రూ.21కోట్లు
- మద్యం షాపులకు 50 మంది మహిళల దరఖాస్తు
- 39 షాపులకు నిల్.. 59 షాపులకు సింగిల్
- కె.కోటపాడు మండలం ఆనందపురం షాపునకు 130 దరఖాస్తులు
- నేడు లాటరీలో కేటాయింపు
సాక్షి, విశాఖపట్నం : రికార్డులు బ్రేకవుతున్నాయి. మద్యం షాపులకు ఊహించని స్పందన వచ్చింది. కేవలం ఒకే ఒక్కరోజులో రాష్ర్టంలోనే రికార్డుస్థాయిలో 5,431 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తు రుసుంలో కూడా రికార్డుల మోత మోగింది. గతేడాది రూ.8.25 కోట్లు వస్తే ఈసారి ఏకంగా రూ.21కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. మహిళలు సైతం ఈసారి పోటీపడుతూ దరఖాస్తులు దాఖలు చేశారు. సోమవారం లాటరీ ద్వారా షాపుల కేటాయింపు కోసం జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వం మినహాయించుకుంది.
మిగిలిన 367 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 328 షాపులకు 5835 దరఖాస్తులు దాఖలయ్యాయి.కాగా మిగిలిన 39 షాపులకు ఒక్క దరఖాస్తు దాఖలు కాలేదు. దరఖాస్తులు దాఖలైన షాపుల్లో 59 షాపులకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. తొలి నాలుగు రోజులు సింగిల్ దరఖాస్తు పడలేదు. ఐదవ రోజు ఏకంగా 134 షాపులకు 406 దరఖాస్తులు దాఖలవగా, చివరిరోజు శనివారం ఏకంగా 5,431 దరఖాస్తులు పడ్డాయి. విశాఖసిటీ పరిధిలోని 60 షాపులకు 1170 దరఖాస్తులు రాగా, గ్రామీణ, ఏజెన్సీ పరిధి లోని షాపులకు 4665 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 50 మంది మహిళలు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేయగా, ఎక్కువ మంది సిటీ పరిధిలోని షాపుల కోసమే పోటీపడుతున్నారు.
లీజు కాలం పెంచడమే కారణం!
గతేడాది 406 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 298 షాపులకు 3312 దరఖాస్తులు రాగా, రూ.8.25కోట్ల ఆదాయం సమకూరింది. 108 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. అలాంటిది ఈసారి దరఖాస్తుల ఫీజులతో పాటు ైలెసైన్సింగ్ ఫీజులును సైతం పెంచినప్పటికీ మద్యం షాపులకు యమ గిరాకీ ఏర్పడింది. వ్యాపారులు పోటీ పడి మరీ దరఖాస్తు చేశారు. గతేడాది వరకు లీజుకాలం ఏడాది మాత్రమే ఉండగా, ఈఏడాది నుంచి షాపుల లీజు కాలం రెండేళ్లకు పెంచడం వల్లే వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపారని భావిస్తున్నారు.
సిటీలో 13 షాపులకు సింగిల్ దరఖాస్తు
సిటీ పరిధిలో జ్ఞానాపురం జంక్షన్‌లోని షాపునకు అత్యధికంగా 115 దరఖాస్తులు దాఖలు కాగా, రూరల్ పరిధిలో కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామంలోని షాపునకు రికార్డు స్థాయిలో 130 దరఖాస్తులు వచ్చాయి. సిటీ పరిధిలో జ్ఞానాపురం తర్వాత తాటిచెట్లపాలెం షాపునకు 63, పెదవాల్తేరు షాపునకు 52 దరఖాస్తులు దాఖలయ్యాయి. సిటీ పరిధిలో పూర్ణామార్కెట్, చావులమదుం, సీతమ్మదార, రైల్వే న్యూ కాలనీ, మల్కాపురం, శ్రీహరిపురం, బీచ్‌రోడ్, మురళీనగర్ ప్రాంతాల్లోని 13 షాపులకు సింగిల్‌దరఖాస్తులు వచ్చాయి. పెరిగిన దరఖాస్తు ఫీజుల వల్ల రాష్ర్ట ఖజానాకు ఏకంగా రూ.21కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది లెసైన్సింగ్ ఫీజుల రూపంలో 141.95 కోట్ల ఆదాయం సమకూరితే ఈ ఏడాది పెరిగిన లెసైన్సింగ్ ఫీజుల వల్ల ఈ మొత్తం రూ.175కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తున్నారు.
స్పాట్‌లో లెసైన్స్ ఫీజు చెల్లించకపోతే..
ఇక సోమవారం ఉదయం 10.30గంటలకు షాపుల కేటాయింపు కోసం లాటరీ తీసేందుకు కైలాసపురంలోని డాక్‌లేబర్ బోర్టు కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ సమక్షంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లాటరీలో షాపు దక్కించుకున్న వారు తొలి క్వార్టర్‌లో ఎప్పుడైనా లెసైన్సింగ్ ఫీజులో మూడవ వంతు చెల్లించే వారు. మారిన నిబంధనల ప్రకారం లాటరీలో షాపు దక్కించుకున్న వ్యక్తి వెంటనే మూడవ వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాలి. లేకుంటే ఆ తర్వాత రెండు, మూడు ఆప్షన్ కింద లాటరీ తీసి వారిలో ఎవరు ైలెసైన్స్ ఫీజు చెల్లిస్తే వారికే షాపు కేటాయిస్తారు.