
శ్రీకాకుళం జిల్లాలో రికార్డు వర్షపాతం
శ్రీకాకుళం: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమయింది. పై-లీన్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే సిక్కోలుపై అల్పపీడనం విరుచుకుపడింది. రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు.
36 గంటలుగా శ్రీకాకుళం జిల్లా లో కుండపోత వానకురుస్తుండటంతో - ఇచ్చాపురం, మందస, కవిటి, కంచలి, సోంపేట మండలాల్లోని ఎనభై లోతట్టు గ్రామాలు నీటమునిగాయి. ఇచ్చాపురం వద్ద బహుదా నది నీరు పొంగిపోర్లుతోంది. రైల్వే ట్రాక్, జాతీయ రహదారి నీటమునిగాయి. దీంతో భువనేశ్వర్ - విశాఖపట్నం ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ పై నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో_ పలు రైలు మళ్లించారు . కొన్ని రైళ్లను రద్దు చేశారు . జాతీయరహదారిపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.రెండు బస్సులు వరదనీటి లో చిక్కుకున్నాయి.
మరోవైపు ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. బాహూదా నదికి వరద ముప్పు పొంచివుండడంతో 6 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదయింది. కంచిలిలో 65 సెంటీమీటర్లు, సోంపేటలో 57.5 సెం.మీ, శ్రీకాకుళంలో 54.4 సెం.మీ, పోలాకిలో 51.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందన్న సమాచారంతో సిక్కోలు వాసులు భీతిల్లుతున్నారు.