రికార్డు టెండర్లు
=గని ఆత్కూర్ ఇసుక రీచ్‌కు డిమాండ్
= 742 మంది దరఖాస్తుదారులు
=బినామీల హవా
= దరఖాస్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం
గొల్లపూడి (విజయవాడ రూరల్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఏడాదిన్నర తరువాత ఇసుక రీచ్ వేలానికి టెండర్లు పిలవగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. శనివారం గొల్లపూడిలోని డ్వామా కార్యాలయం వేలంలో పాల్గొనే దరఖాస్తుదారులతో కిక్కిరిసింది. లాటరీ పద్ధతిలో ఇసుక వేలం చేపడుతుండటంతో టెండర్‌దారులు ఎగబడ్డారు. 742 మంది దరఖాస్తులు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉన్నప్పటికీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇసుక రీచ్ కోసం టెండర్లు వేయటానికి వచ్చినవారి వాహనాలు కార్యాలయం చుట్టూ పెద్ద సంఖ్యలో కనిపించాయి.
క్యూ కట్టిన ఇతర జిల్లాల సిండికేట్లు...
ఇసుక రీచ్ వేలం కోసం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్‌ల నుంచి కూడా పలువురు సిండికేట్లు కూడా క్యూ కట్టారు. ఇతర జిల్లాల నుంచి వేలం పాటలో దరఖాస్తులను సమర్పించేవారు అధిక సంఖ్యలో రావటంతో అధికారులు కార్యాలయంలో ఐదు కౌంటర్లను ఏర్పాటుచేశారు. పలువురు రాజకీయ నేతల బినామీదారులు ఇందులో పాల్గొని హడావిడి చేశారు. జిల్లాలోని 72 ఇసుక క్వారీల వేలం నిర్వహణ బాధ్యతలను మైనింగ్ శాఖ నుంచి డ్వామా ప్రాజెక్ట్ కార్యాలయానికి ఏడాదిన్నర క్రితం అప్పగించారు. ఈ నేపథ్యంలో గని ఆత్కూరు వేలానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ దఫా వేలానికి లాటరీ పద్ధతి అమలు చేస్తున్నారు. ఇసుక రీచ్ వేలం కోసం 742 మంది ఒక్కొక్కటి రూ.5,000 చొప్పున దరఖాస్తులు కొనుగోలు చేసి అందజేశారు.
36 వేల క్యూబిక్ మీటర్లకే అనుమతి
గని ఆత్కూరు ఇసుక రీచ్‌లో 36 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు మాత్రమే ప్రభుత్వం నిబంధనలు విధించింది.
క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున ధర విధించింది. తద్వారా రూ.14 లక్షల 40 వేల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకోనుంది.
దరఖాస్తుదారులు ఒక్కొక్కరు రూ.3.60 లక్షలు డిపాజిట్ చేశారు. దీంతో పాటు రూ.15 లక్షల విలువైన సొంత ఆస్తుల సాల్వెన్స్ సర్టిఫికెట్లు సమర్పించారు.
పురుషులతో పాటు మహిళలూ దరఖాస్తు చేయటం విశేషం.
గత నెల 20 నుంచే ఈ దరఖాస్తులు విక్రయించారు. జిల్లాలోని సిండికేట్లు దరఖాస్తులను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలిసింది.
జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలంపాటలు లేక గత కొంతకాలం నుంచి నిలిపివేయటంతో డీసెల్టేషన్ పద్ధతిలో ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, భవానీపురంలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, వివిధ సొసైటీల ద్వారా అందజేస్తున్నారు.
ఈ నెల 10న మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు.