
టీజీటీ పోస్టుల భర్తీకి స్పందన కరవు
గుంటూరు ఎడ్యుకేషన్
మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థుల నుంచి స్పందన కరువైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పాఠశాలల్లో వంద పోస్టుల భర్తీకి పాత బస్టాండ్ సెంటర్‌లోని పరీక్ష భవన్‌లో నిర్వహించిన పరిశీలనకు కేవలం 43 మంది హాజరయ్యారు. అభ్యర్థుల్లో పలువురు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో సోమవారం అవకాశం ఇచ్చారు.
గైర్హాజరైన అభ్యర్థులు కూడా హాజరుకావచ్చని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఉదయం పది గంటల నుంచి గుంటూరు అరండల్‌పేట 12 లైనులోని తమ కార్యాలయంలో హాజరు కావాలని పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి ఆదేశించారు. గైర్హాజరైన అభ్యర్థుల వివరాలను మెరిట్ జాబితాలో నుంచి తొలగించేందుకు పాఠశాల విద్య డెరైక్టర్‌కు పంపుతామని ఆమె స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, ఆర్జేడీ కార్యాలయ అసిస్టెంట్ డెరైక్టర్ వై.విజయలక్ష్మి, సూపరింటెండెంట్లు వీవీ నరసింహారావు, వి.శ్రీనివాసరావు, డైట్ అధ్యాపకులు కృష్ణయ్య, సుభానీ తదితరులు పాల్గొన్నారు.