తెగబడ్డారు | Red sandal smuggling on a rise | Sakshi
Sakshi News home page

తెగబడ్డారు

Published Mon, Dec 16 2013 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

Red sandal smuggling on a rise

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. తమిళనాడు నుంచి తరలి వచ్చిన కూలీలు యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికి అక్రమ రవాణా చేస్తున్నారు. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించే అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. మారణాయుధాలతో సంచరిస్తున్న స్మగ్లర్లు అటవీ ఉద్యోగులను హత మార్చేందుకూ వెనుకాడటం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలో ఉద్యోగులున్నారు.
 
 రాజంపేట, న్యూస్‌లైన్: శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నరికేస్తున్నారు. అడ్డొచ్చిన అటవీ అధికారులను అంతమొందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో అటవీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కడప -చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉన్న తుంబురతీర్థం సమీపంలో స్మగ్లర్లు తెగబడ్డారు. అధికారులపై దాడి చేసి ఇద్దరిని దారుణంగా చ ంపారు. మరికొందరు సిబ్బంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు.
 
 ఈ సంఘటన అటవీ ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్న అటవీ అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిరాయుధులంగా ఉంటూ స్మగ్లర్ల చర్యలను ఎలా తిప్పికొట్టాలని ప్రశ్నిస్తున్నారు. అయితే తుంబరతీర్ధం వద్ద జరిగిన సంఘటనతో తుమ్మలబైలు, బాలపల్లె, మామండూరు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తమిళ స్మగ్లర్లు జిల్లాలోని శేషాచలం అడవుల వైపు వస్తారన్న అనుమానంతో అడవిలో గాలింపు చేస్తున్నారు. వారు వైఎస్సార్ జిల్లాలో రోడ్డు, రైలు మార్గం ద్వారా వారి గమ్యాలకు చేరుకుంటారనే అనుమానాలు అటవీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
 
 ఆయుధాలు లేకుంటే వెళ్లలేం
 స్మగ్లర్ల చేతిలో ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురైన నేపథ్యంలో ప్రస్తుతం అటవీ ఉద్యోగులు అడవిలోనికి వెళ్లి విధులు నిర్వహించాలంటేనే వణికిపోతున్నారు. ఆయుధాలు లేకుండా విధులకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. పాతకాలం నాటి తుపాకులు ఉన్నాయే తప్ప అధునాతన ఆయుధాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లను కాల్చివేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. కేవలం అడవిలో సాయుధ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కూంబింగ్ చేస్తున్నారు. అయితే అటవీ సిబ్బంది చేతికి మాత్రం ఆయుధాలు ఇవ్వలేదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. తుంబురతీర్థం సంఘటనతో అడవిలోకి  అటవీ సిబ్బంది వెళ్లడంలేదు.
 
 అప్రమత్తమైన అటవీశాఖ
 కడప-చిత్తూరు జిల్లా సరిహద్దులో జరిగిన సంఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. తమిళనాడుకు  చెందిన స్మగ్లర్లు ఇటీవల శేషాచలం అడవిలో తిష్ట వేశారు. వారిని నియంత్రించేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికే అడవిలో అనేకమార్లు స్మగ్లర్లు తిరగబడటం, చెక్‌పోస్టులను సైతం లెక్కచేయకుండా స్మగ్లింగ్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో తమిళ తంబిలను అరెస్టు చేశారు. అయినప్పటికీ వారి ఆగడాలు ఆగడం లేదు. శేషాచలం అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అరాచకాలకు ఎలా అడ్డుకట్ట వేయాలనే విషయంపై అటవీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తిస్థాయి రక్షణ లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకోలేమనే అభిప్రాయంలో వారున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement