హైదరాబాద్: అటవీ శాఖ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను వచ్చే ఏడాదిలోగా ఎగుమతి చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సూత్రపాయ ఆమోదం తెలిపింది. 8,584 టన్నుల ఎర్రచందనం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌ఏ) ఇచ్చిన గడువు ఈనెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండో విడత ఎర్రచందనం దుంగల విక్రయానికి ఈ - టెండర్లు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర అటవీ శాఖ దుంగల ఎగుమతికి అదనపు గడువు కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) ఏవీ జోసెఫ్ కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రితోనూ, డీజీఎఫ్‌ఏ అధికారులతోనూ ఈ అంశంపై చర్చించారు. దీంతో మరో ఏడాది గడువు పొడిగించేందుకు డీజీఎఫ్‌ఏ అంగీకరించింది.
ఈ నేపథ్యంలో 3500 టన్నుల ఎర్రచందనం విక్రయానికి వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత ఈ టెండరు ప్రకటన జారీ చేస్తామని రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి మురళీకృష్ణ తెలిపారు. టెండర్లు నిర్వహించేందుకు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్ధారించిన ఎర్రచందనం దుంగలను డ్రెస్సింగ్ చేసి గోదాముల్లో సిద్ధంగా ఉంచామని ఆయన 'సాక్షి' కి తెలిపారు. టెండరు ప్రకటన జారీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఫైలు పంపామని, ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు.