► ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడుతున్న ఎస్పీ
► టాస్క్‌ఫోర్స్‌తో సత్ఫలితాలు
► నిన్న వెంకటరమణ..నేడు ముఖేశ్ బదాని అరెస్ట్
► ఎర్ర దొంగల్లో గుబులు
► ‘ఎర్ర’ లింకులున్న పోలీసులపై వేటు
► ఒంటిమిట్ట ఘటనలో ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ సస్పెన్షన్
► సంబేపల్లి పోలీసుస్టేషన్‌లో ముగ్గురిపై వేటు
► చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట
► అటవీ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న కూంబింగ్
సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడినా, స్మగ్లర్లకు సహకరించినా జిల్లా ఎస్పీ పోలీసు దెబ్బ రుచి చూపిస్తున్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్‌ృ బందం ఆశించిన రీతిలో ఫలితాలు సాధిస్తోంది. ఓ వైపు కూంబింగ్ నిర్వహిస్తూనే మరో పక్క స్మగ్లర్ల ఆట కటి ్టస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లను ఒక్కొక్కరినీ పట్టుకోగలుగుతున్నారు.
వారి నుంచి రాబట్టిన సమాచారంతో చోటా.. మోటా స్మగ్లర్లను ఏరి పారేస్తున్నారు. సుమారు నెల రోజులుగా టాస్క్‌ఫోర్‌ృ బందం శేషాచలం అడవుల్లో విృస్తతంగా కూంబింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణ(టీడీపీ నేత)ను చాకచక్యంగా పట్టుకుని కోట్లాది రూపాయల విలువైన చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హర్యానాలో అంతర్జాతీయ స్మగ్లర్ అయిన బదానీని శనివారం అరెస్టు చేశారు.
రెండు, మూడు రోజుల్లో జిల్లాకు బదాని
అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానీని రెండు, మూడు రోజుల్లో జిల్లాకు తీసుకు రానున్నట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన శనివారం కలెక్టరేట్ వద్ద మీడియాకు వెల్లడించారు. కాగా, బదానీకి జిల్లాలో కొంత మంది స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. బదానీని కడపకు తీసుకు వచ్చి విచారిస్తే పలువురి గుట్టు రట్టుకానుంది.
చైనా స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట
వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్థానిక స్మగ్లర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది చైనాకు సంబంధించిన స్మగ్లర్లు కూడా ఢిల్లీలో మకాం వేసి స్థానిక స్మగ్లర్ల ద్వారా రవాణాసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హర్యాన వెళ్లిన కడప ప్రత్యేక పోలీసృ బందం చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట కొనసాగిస్తోందని సమాచారం. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ అహ్మద్‌ను పట్టుకునేందుకు కూడా నిఘా పెట్టినట్లు తెలియవచ్చింది.
ఒంటిమిట్ట ఘటనపై సీరియస్
ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ ఆవరణంలోనున్న సుమారు 18 ఎర్రచందనం దుంగలు మాయం కావడాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠి సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తూ తొలుత ఏఎస్‌ఐతోపాటు మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఎర్రచందనం దుంగలను దోచుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
పలువురు కానిస్టేబుళ్లపై వేటు
జిల్లాలోని పలు స్టేషన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లపై శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్‌నవీన్ గులాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సంబేపల్లె పోలీసుస్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మురళిరాజు, కానిస్టేబుళ్లు మోహ న్, నరేంద్రలను సస్పెండ్ చేశారు. ఇవే ఆరోపణలపై మరో ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు సివిల్ పంచాయతీల్లో తల దూర్చడం మితిమీరడంతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.
పోలీసులు.. ఎర్రలింకులు
కడప అర్బన్ : ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయనే కారణంతో ఇప్పటి దాకా పదుల సంఖ్యలో పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 2006లో సీఐలు, ఎస్‌ఐలు,ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో కలిపి 21 మందిని అప్పటి ఎస్పీ నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. పలువురు అటవీ శాఖ సిబ్బందిపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది రాజంపేట డీఎస్పీ జీవీ రమణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. తాజాగా ఒంటిమిట్ట, సంబేపల్లెలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఒక ఏఎస్‌ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. లోతుగా విచారిస్తే మరికొంత మంది పోలీసు దొంగలు బయటపడే అవకాశం ఉంది.
రెడ్ సిగ్నల్
Published Sun, May 17 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement