పిడికిలి
కడప అర్బన్ : జిల్లాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లుగా చలామణి అవుతున్న ముగ్గురిని ఎస్పీ జీవీజీ అశోకకుమార్ ఆదేశాల మేరకు రాజంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిపై పీడీ యాక్ట్ కేసు పెట్టారు. వారి వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని రైల్వేకోడూరుకు చెందిన దేవులపల్లి రాజశేఖర్ అలియాస్ చిన్నాను అరెస్టు చేశామన్నారు. ఇతను 2009లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ఇతను ముఖ్య అనుచరుడన్నారు.అలాగే మైదుకూరు మండలం దువ్వూరుకు చెందిన నాగినేని శివ 2007 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పరారీలో ఉన్నాడన్నారు. ఇతను 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వేంపల్లె మండలం నందిపల్లెకు చెందిన వీరం లింగేశ్వరరెడ్డి అలియాస్ వీరుడు నాలుగేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్నారు. ఇతను ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామన్నారు.