
చింతమనేని ప్రభాకర్
టీడీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి హెచ్చరిక
ఎంపీపీ పదవిని రూ.40 లక్షలకు అమ్మేశాడని ఆరోపణ
నాయకులు, కార్యకర్తలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరిక
ఏలూరు రూరల్: ‘‘చింతమనేని ప్రభాకర్.. పిచ్చి వేషాలు మానుకో. సామాన్య ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకోం’’ అంటూ తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆయన మంగళవారం ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఈ డబ్బు చేతులు మారిందన్నారు. అందుకు ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఎంపీపీ పీఠం నుంచి తొలగించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవి కట్టబెట్టేందుకు చింతమనేని కుతంత్రాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇందుకోసం పార్టీ మారిపోతున్నామంటూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
లంచాలు పుచ్చుకుని, మట్టి, ఇసుకతోపాటు అభివృద్ధి పేరిట ప్రభుత్వ సొమ్ము దోచుకుని తానేమీ సంపాదించలేదంటూ చింతమనేనికి చురకలేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి తన భార్య రెడ్డి అనురాధ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జెడ్పీ కార్యాలయానికి వెళ్లి రాజీనామా లేఖ అందించారు.