సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి): టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడి వైద్యులు పైకి దెబ్బలేమీ కనిపించటంలేదనీ, మెడికల్ లీగల్ కేసు చేయటానికి అవకాశం లేదని చెప్పి పంపించివేశారు.
దెందులూరు గ్రామం కాసీ కాలనీకి చెందిన దివ్యాంగుడు సంపంగి సింహాచలం తెలిపిన వివరాలు.. సింహాచలం తన కాలనీలో కిళ్లీకొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సింహాచలం ఇంటిలో అద్దెకు దిగిన ఈదుపల్లి రామారావు క్రమంగా ఆ ఇంటిని ఆక్రమించాడు. దీంతో సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇంటి తగాదా విషయం కోర్టులో ఉంది. అయితే ఇటీవల భీమడోలు సీఐ ఇద్దరినీ పిలిపించి వివాదంపై విచారణ చేశారు.
ఎమ్మెల్యే చింతమనేని తనకు అండగా ఉన్నారని, ఇంటిలోని సింహాచలం సామానులన్నీ బయట వేయమన్నారని విచారణలో రామారావు చెప్పాడు. ఎమ్మెల్యేను కలసి ధ్రువీకరించుకోవాలని సింహాచలానికి సీఐ సలహాఇచ్చారు. దీంతో గురువారం ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి సింహాచలం, అతని తల్లిదండ్రులు రంగారావు, అప్పలనరసమ్మ కలసి వెళ్లారు. న్యాయం చేయాలని కోరగా ఆగ్రహించిన చింతమనేని.. సింహాచలంపై చేయిచేసుకుని చెంపలపై గట్టిగాకొట్టారు.
అడ్డువచ్చిన సింహాచలం తల్లి చెంపపై గట్టిగా కొట్టి.. తండ్రి డొక్కల్లో బలంగా తన్నారు. సింహాచలాన్ని తన్నుతూ.. దుర్భాషలాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారు. సింహాచలాన్ని అతని తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు పట్టించుకోలేదు. చింతమనేని దౌర్జన్యంపై ఏలూరు త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment