కావలి: కావలి కాలువను ఆధునికీకరిస్తామని రాష్ట్రప్రభుత్వ ప్రకటన నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేసిన నిరాహార దీక్ష ఫలితమేనని స్థానిక రైతులు చెబుతున్నారు. కావలి కాలువ ఆయకట్టు రైతులు పడుతున్న సాగునీటి ఇబ్బందులకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతారని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే ప్రశ్నించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో వీటన్నింటిని చూస్తే అర్థమవుతుందని వారు చెబుతున్నారు. కావలి కాలువ రైతులు గత నాలుగేళ్లుగా సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెరిగిన ఆయకట్టుకు అనుగుణంగా కాలువ ఆధునికీకరణ జరగకపోవడంతో ఈసమస్య నెలకొంది. కావలి కాలువ నిర్మాణ సమయంలో 28 వేల ఎకరాలు సాగునీటిని ఇవ్వాలనే లక్ష్యంతో నిర్మించగా ఇప్పుడు సాగువిస్తీర్ణం లక్ష ఎకరాలకు పైగా చేరుకుంది.
నియోజకవర్గంలోని కావలి పట్టణం, రూరల్, బోగోలు, దగదర్తి, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం, కలిగిరి మండలంలో కొంతభాగానికి సాగునీటిని అందిస్తుంది. కావలి ఎస్‌ఎస్ ట్యాంక్‌కు తాగునీటిని అందిస్తుంది. గత కొన్నేళ్లుగా కావలి కాలువ సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాలేదు.
రైతుల సాగునీటి సమస్యలపై చలించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను, రాష్ట్రమంత్రులను కలిశారు. అసెంబ్లీలో కూడా నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షను చేపట్టి కావలి చరిత్రలో నిలిచిపోయారు. ఆ దీక్షను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
నిర్మాణంపై ఎన్నో అనుమానాలు..
కావలి కాలువను వెడల్పు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చేసిన ప్రకటనలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. తాగు, సాగు నీటి సమస్య కు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం ఇలా..
సంగం బ్యారేజి నిర్మాణాన్ని పూర్తిచేసి ఇసుక బస్తాలు వేసే శ్రమను తగ్గించాలి.
కావలి కాలువ సామర్థ్యాన్ని 1,200 క్యూసెక్కులకు పెంచాలి. కాలువనూ పూర్తిగా లైనింగ్ చేయాలి.. రుద్రకోట వరకు అన్నీ అటవీ అనుమతులు తీసుకుని కాలువ విస్తీర్ణం పెంచాలి.
నియోజకవర్గంలోని అన్నీ చెరువులకు కావలి కాలువ నీటిని నింపేందుకు మార్గం ఉండేలా కాలువలు నిర్మించాలి. దీని ద్వారా సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి.
చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాక కావలి పట్టణం, రూరల్ మండలంలోని గ్రామాలకు కావలి కాలువ నుంచి నీరు వెళ్లేలా బైపాస్ కెనాల్‌ను నిర్మించాలి.
సంగం బ్యారేజి నుంచి కావలి కాలువకు ప్రత్యేక హెడ్ రెగ్యులేటరి నిర్మించాలి.
ఇప్పుడు ప్రకటించిన అధునీకరణను ఎలా చేస్తారు, ఎప్పుటి నుంచి చేస్తారో ప్రకటించాలి.
రామిరెడ్డి దీక్షతో దిగొచ్చారు
Published Tue, Mar 10 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement