సాక్షి, కర్నూలు : జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా దిగువకు వరద పోటెత్తడంతో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలోని ప్రాజెక్టులు తక్కువ రోజుల్లోనే నిండిపోయాయి. 25 ఏళ్ల తర్వాత కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్నాయి. అయితే అంతకు మించి నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో నీరంతా వృథాగా సముద్రం పాలైంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 400 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. కృష్ణా, తుంగభద్రలో వరద ప్రవాహం తగ్గడంతో జూరాల నుంచి 3 రోజుల క్రితం, సుంకేసుల బ్యారేజీ నుంచి ఆదివారం నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయడంతో శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో ఆగిపోయింది.
ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరదనీటి చేరిక మొదలైంది. 12న గరిష్టంగా 8,68,492 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 25 రోజుల్లోనే 785 టీఎంసీలకుపైగా వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్ చేరింది. 2009 తర్వాత తక్కువ రోజుల్లోనే ఇంత పెద్దమొత్తంలో నీరు చేరడం ఇదే ప్రథమం. అలాగే ఈ నెల 12న సుంకేసుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలు శ్రీశైలానికి వదిలారు. ఇంజినీర్ల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 79 టీఎంసీలకుపైగా శ్రీశైలానికి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో శ్రీశైలం డ్యాం గేట్లను కూడా నాలుగు రోజుల క్రితమే బంద్ చేశారు. ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 575 టీఎంసీల నీటిని వదిలారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 882 అడుగుల వద్ద 202 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయినప్పటికి జలాశయం నుంచి దిగువప్రాంతాలకు 24,426 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment