సాక్షి అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: ఎగువ ప్రాంతమైన భద్రాచలం వద్ద గోదావరి నది శాంతించినప్పటికీ.. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి శని వారం కూడా కొనసాగింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 118 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. శుక్రవారం పాశర్లపూడి కాజ్‌వేపై నుంచి వెళ్తుండగా వెళ్తుండగా గల్లంతైన షమీర్‌బాషా, రెహ్మాన్ అచూకీ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గాలించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన నేతల సుబ్బమ్మ (82) గల్లంతైంది. ఇంటి వెనుక గోదావరి పాయలో కాళ్లు కడుక్కుంటుండగా జారి పడిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 15.10 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15.01 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద 39.20 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.
మురమళ్ల వద్ద వృద్ధగౌతమి పుష్కరఘాట్ వద్ద వరద నీరు చేరడంతో బోట్లు నిలిచిపోయాయి. పాశర్లపూడి బాడవలోని మల్లికార్జున స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలోకి వరద పోటెత్తింది. పి.గన్నవరం మండలం నాగుల్లంక పుచ్చల్లంకలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. యానాం బీచ్ రోడ్డు మునిగిపోయింది. విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్‌పురంలలో వరద తగ్గడంతో ఉపశమనం కలిగింది. చింతూరు మండలంలో వరద తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు మొదలు కాగా, ఒడిశాకు మాత్రం నిలిచిపోయాయి. వరద ప్రభావిత గ్రామాల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శనివారం పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో 31 గ్రామాలు నీట మునిగాయి.
పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 3 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నిడదవోలు మండలం పెండ్యాల, పందలపర్రు, పెరవలి మండలం కానూరు, కానూరు ఆగ్రహారం, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో లంక భూములు ఇంకా వరద నీటిలో నానుతున్నాయి. యలమంచిలి మండలం బాడవ, యలమంచిలి లంకల్లో రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దొడ్డిపట్ల, కనకాయలంక, లక్ష్మిపాలెంల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆచంట మండలం అనగారలంక, పెదమల్లంలంక, పుచ్చల్లంక, అయోధ్యలంక, భీమలాపురం కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది.
10 రోజుల్లో 1,100 టీఎంసీలు కడలి పాలు
గోదావరి నది నుంచి పది రోజుల్లో 1,100 టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిశాయి. అంటే.. రోజుకు సగటున 110 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలైనట్లు స్పష్టమవుతోంది. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు గొట్టా బ్యారేజీకి 17,645 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment