Davaleshwaram
-
శాంతించి‘నది’
సాక్షి అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: ఎగువ ప్రాంతమైన భద్రాచలం వద్ద గోదావరి నది శాంతించినప్పటికీ.. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి శని వారం కూడా కొనసాగింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 118 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. శుక్రవారం పాశర్లపూడి కాజ్‌వేపై నుంచి వెళ్తుండగా వెళ్తుండగా గల్లంతైన షమీర్‌బాషా, రెహ్మాన్ అచూకీ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గాలించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన నేతల సుబ్బమ్మ (82) గల్లంతైంది. ఇంటి వెనుక గోదావరి పాయలో కాళ్లు కడుక్కుంటుండగా జారి పడిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 15.10 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15.01 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద 39.20 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. మురమళ్ల వద్ద వృద్ధగౌతమి పుష్కరఘాట్ వద్ద వరద నీరు చేరడంతో బోట్లు నిలిచిపోయాయి. పాశర్లపూడి బాడవలోని మల్లికార్జున స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలోకి వరద పోటెత్తింది. పి.గన్నవరం మండలం నాగుల్లంక పుచ్చల్లంకలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. యానాం బీచ్ రోడ్డు మునిగిపోయింది. విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్‌పురంలలో వరద తగ్గడంతో ఉపశమనం కలిగింది. చింతూరు మండలంలో వరద తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు మొదలు కాగా, ఒడిశాకు మాత్రం నిలిచిపోయాయి. వరద ప్రభావిత గ్రామాల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శనివారం పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో 31 గ్రామాలు నీట మునిగాయి. పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 3 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నిడదవోలు మండలం పెండ్యాల, పందలపర్రు, పెరవలి మండలం కానూరు, కానూరు ఆగ్రహారం, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో లంక భూములు ఇంకా వరద నీటిలో నానుతున్నాయి. యలమంచిలి మండలం బాడవ, యలమంచిలి లంకల్లో రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దొడ్డిపట్ల, కనకాయలంక, లక్ష్మిపాలెంల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆచంట మండలం అనగారలంక, పెదమల్లంలంక, పుచ్చల్లంక, అయోధ్యలంక, భీమలాపురం కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. 10 రోజుల్లో 1,100 టీఎంసీలు కడలి పాలు గోదావరి నది నుంచి పది రోజుల్లో 1,100 టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిశాయి. అంటే.. రోజుకు సగటున 110 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలైనట్లు స్పష్టమవుతోంది. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు గొట్టా బ్యారేజీకి 17,645 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలారు. -
భారీ వర్షం : ప్రాజెక్టుల్లోకి పెరుగుతోన్న ఇన్‌ప్లో
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ఆవర్తనంతో రెండు రాష్ట్రాలు తడిసి ముద్దవతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్గొండలోని మూసీ ప్రాజెక్టులోకి భారీ వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645అడుగులు కాగా, ప్రస్తుతం 637 అడుగులకు చేరింది. నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 698అడుగులకు చేరింది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 23వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సాధారణ నీటిమట్టం 1091అడుగులు కాగా ఇప్పటికే 1058.08అడుగుల నీరి వచ్చి చేరింది. ఇన్‌ప్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. భారీ వరద నీరుతో భద్రాద్రిలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం దాని నీటిమట్టం 72.75క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తేసి 1897కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుమరంభీంలోని కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగుప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. గుండివాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. ఆసిఫాబాద్‌లోని డోర్లీ, ఖైరిగూడ ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జైనూర్ మండలం పట్నాపూరలో భారీ వర్షం కారణంగా పట్నాపూర్ వాగులో ఆవుల కాపరి కొట్టుకు పోయాడు. వాగువద్ద ప్రజలు గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీలోనూ అదేపరిస్థితి ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జ్ వద్ద గోదావరి మట్టం 9.3అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 3,04,845క్యూసెక్కులుగా ఉంది. 4వేల క్యూసెక్కుల నీటిని డెల్టాకు విడుదల చేశారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడలో ముసురు పట్టి కురుస్తున్న వాన జల్లులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మైలవరం, రెడ్డిగూడెం, బాపులపాడు, వత్సవాయి, గన్నవరం, నందిగామ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో తూర్పు గోదావరిలోని ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య గోదావరిలో వేసిన మట్టబాట కొట్టుకుపోయింది. భారీవర్షాల కారణంగా గోవావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
ధవళేశ్వరం వద్ద 19 అడుగులకు చేరిన నీటిమట్టం
సాక్షి నెట్వర్క్: ఎగువప్రాంతాల నుంచి వరద తగ్గినా ఉగ్ర గోదావరి శాంతించడం లేదు. ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పలు ఏజెన్సీ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదహెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు 58.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. పరీవాహక ప్రాంత 14 మండలాల్లోని 172 గ్రామాలను నీరు చట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద క్రమేపీ పెరుగుతూ వచ్చిన నీటిమట్టం మధ్యాహ్నం 12గంటలకు 19 అడుగులకు చేరింది. జిల్లాలోని లంక గ్రామాలు గజగజలాడుతున్నాయి. పరీవాహక ప్రాంత 16 మండలాల్లో 59 గ్రామాల జలమయమయ్యాయి. లక్షా 41వేల మందిపై వరద ప్రభావం పడుతోంది. పునరావాస కేంద్రాలు సైతం ముంపుబారిన పడ్డాయి. తాజా వరదల ప్రభావంతో 10,171 ఎకరాల్లో వాణిజ్య, కూరగాయ పంటలు, వరి దెబ్బతినడంతో రైతులకు రూ. 13.38 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 26 గిరిజనగ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదుల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరదల వల్ల ఆరుగురు మృతి: వరదలతో వైద్యం అందక ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని కూనవరం పునరావాస కేంద్రంలో షేక్ మీరా(76) మృతి చెందాడు. ఇదే మండలంలోని టేకులబోరుకు చెందిన కమలమ్మ(56), వీఆర్‌పురం మండలంలోని ధర్మతాళ్లగూడెం గ్రామానికి చెందిన సోంది ముత్తమ్మ(40) అనారోగ్యంతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సలాదిపాలెనికి చెందిన గుత్తాల సత్యనారాయణ వరదల్లో గల్లంతయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ముసలమ్మ(51) వరదల వల్ల రోడ్డు పక్కన ఏర్పడ్డ గోతిలో పడి మృతి చెందారు. అమలాపురం మాజీ ఎంపీపీ బాసిన సూర్యనారాయణరావు (72) బండారులంక ఎగువ కౌశికలో పడి మరణించారు. మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన ఆకుమర్తి నరసింహమూర్తి (55) పాముకాటుకు గురై చనిపోయాడు. నేతలను నిలదీసిన బాధితులు ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 94 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 16 వేల మంది బాధితులను తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందడం లేదు. భద్రాచలంలో ఏర్పాటుచేసిన పునరావాసకేంద్రాన్ని పరిశీలించటానికి వచ్చిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్యెల్యే కుంజా సత్యవతిని బాధితులు నిలదీశారు. అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముక్కిపోయి, పురుగులు పట్టిన బియ్యం ఇస్తే ఎలా వండుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పిస్తానని ఎమ్మెల్సీ పొంగులేటి చెప్పగా.. సమయానికి తిండిపెట్టలేని ప్యాకేజీలు తమకెందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రాచలం-కూనవరం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపారు.