సాక్షి నెట్‌వర్క్: ఎగువప్రాంతాల నుంచి వరద తగ్గినా ఉగ్ర గోదావరి శాంతించడం లేదు. ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పలు ఏజెన్సీ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదహెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు 58.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. పరీవాహక ప్రాంత 14 మండలాల్లోని 172 గ్రామాలను నీరు చట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద క్రమేపీ పెరుగుతూ వచ్చిన నీటిమట్టం మధ్యాహ్నం 12గంటలకు 19 అడుగులకు చేరింది. జిల్లాలోని లంక గ్రామాలు గజగజలాడుతున్నాయి. పరీవాహక ప్రాంత 16 మండలాల్లో 59 గ్రామాల జలమయమయ్యాయి. లక్షా 41వేల మందిపై వరద ప్రభావం పడుతోంది. పునరావాస కేంద్రాలు సైతం ముంపుబారిన పడ్డాయి. తాజా వరదల ప్రభావంతో 10,171 ఎకరాల్లో వాణిజ్య, కూరగాయ పంటలు, వరి దెబ్బతినడంతో రైతులకు రూ. 13.38 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 26 గిరిజనగ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదుల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది.
వరదల వల్ల ఆరుగురు మృతి: వరదలతో వైద్యం అందక ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని కూనవరం పునరావాస కేంద్రంలో షేక్ మీరా(76) మృతి చెందాడు. ఇదే మండలంలోని టేకులబోరుకు చెందిన కమలమ్మ(56), వీఆర్‌పురం మండలంలోని ధర్మతాళ్లగూడెం గ్రామానికి చెందిన సోంది ముత్తమ్మ(40) అనారోగ్యంతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సలాదిపాలెనికి చెందిన గుత్తాల సత్యనారాయణ వరదల్లో గల్లంతయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ముసలమ్మ(51) వరదల వల్ల రోడ్డు పక్కన ఏర్పడ్డ గోతిలో పడి మృతి చెందారు. అమలాపురం మాజీ ఎంపీపీ బాసిన సూర్యనారాయణరావు (72) బండారులంక ఎగువ కౌశికలో పడి మరణించారు. మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన ఆకుమర్తి నరసింహమూర్తి (55) పాముకాటుకు గురై చనిపోయాడు.
నేతలను నిలదీసిన బాధితులు
ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 94 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 16 వేల మంది బాధితులను తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందడం లేదు. భద్రాచలంలో ఏర్పాటుచేసిన పునరావాసకేంద్రాన్ని పరిశీలించటానికి వచ్చిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్యెల్యే కుంజా సత్యవతిని బాధితులు నిలదీశారు. అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముక్కిపోయి, పురుగులు పట్టిన బియ్యం ఇస్తే ఎలా వండుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పిస్తానని ఎమ్మెల్సీ పొంగులేటి చెప్పగా.. సమయానికి తిండిపెట్టలేని ప్యాకేజీలు తమకెందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రాచలం-కూనవరం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపారు.
ధవళేశ్వరం వద్ద 19 అడుగులకు చేరిన నీటిమట్టం
Published Mon, Aug 5 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement