భద్రాచలం, న్యూస్‌లైన్ : విపత్తుల సమయంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విఫలమవుతోంది. వరద బాధితులకు సహాయం అందించాల్సిన అధికారులు.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవనే సాకుతో చేష్టలుడిగి చూస్తున్నారు. వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 172 గ్రామాలు ముంపులోనే ఉన్నాయని ప్రకటించిన అధికారులు బాధితులకు పునరావాస చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భద్రాచలం వద్ద అత్యధికంగా 62 అడుగుల నీటిమట్టంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి కొద్దిగా శాంతించినప్పటికీ గ్రామాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఆదివారం రాత్రి 7గంటలకు 57.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. సోమవారం నాటికి ఇంకొంచెం తగ్గే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు ప్రకటించారు.
వరదతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని 14 మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. ఆయా గ్రామాల ప్రజలు నాలుగు రోజులుగా అంధకారంలోనే అలమటిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక సెల్‌ఫోన్‌లకు చార్జింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. దీంతో తమ ఇబ్బందులు అధికారులకు చెప్పుకునే అవకాశం కూడా చెప్పుకోలేకపోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో ఎటూ వెళ్లలేకపోతున్నారు. అయితే ఆదివారం భద్రాచలం నుంచి మారాయిగూడెం మీదగా చర్ల వరకు, చింతూరు మండలం చట్టి వరకు కొన్ని ఆర్టీసు బస్సులను మాత్రం నడిపారు.
ప్రాణాలు పోతున్నా పట్టదా...
వరదలతో ఆస్పత్రులకు కూడా వెళ్లే దారిలేక ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కూనవరం మండల కే ంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో షేక్ మీరా(76) సకాలంలో వైద్యం అందక ఆదివారం మృతి చెందాడు. ఇదే మండలంలోని టేకులబోరుకు చెందిన సూరం కమల(56) కూడా అనారోగ్యంతో మృతిచెందింది. వీఆర్ పురం మండలం ధర్మతాళ్ల గూడెంనకు చెందిన సొంది ముత్తమ్మ(40) కూడా ఈ నేపథ్యంలోనే మృత్యువాత పడింది. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఉన్నప్పటికీ వారి వద్దకు వెళ్లేందకు దారి లేక, అందుబాటులో పడవలు లేక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. నాలుగు రోజులుగా వరద నీరు అలానే ఉండటంతో గ్రామాల్లో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా జ్వరపీడితులు పెరుగుతున్నారు. సరైన పారిశుధ్య చర్యలు లేవు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు.
తగ్గని వరద పోటు...
భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 61 అడుగులు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి కొద్దిగా తగ్గినప్పటికీ వరద నీరు గ్రామాలను విడిచిపెట్టలేదు. భద్రాచలం పట్టణంలో ఇంకా వరద నీరు పెరుగుతోంది. రామాలయం చుట్టుపక్కల ఉన్న ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రామాలయానికి వెళ్లే దారిలో ఓంశాంతి సత్రం దాటి రహదారిపై వరద నీరు చేరింది. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా స్టేడియంలోకి కూడా వరద నీరు చేరింది. సుభాష్‌నగర్ కాలనీలో రెండు వందలకు పైగా ఇళ్లు నీటమునిగాయి. ఇక్కడి నుంచి వరద నీరు రామాలయం వైపు వస్తుండటంతో వరద పోటు పెరుగుతోంది. దీంతో పట్టణ వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
సహాయక చర్యల పట్ల నిర్లక్ష్యం...
ముంపు ప్రాంత బాధితులను ఆదుకోవటంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 57 అడుగుల నీటిమట్టం నమోదైనప్పుడు రెండు హెలికాప్టర్‌ల ద్వారా ఆహార పొట్లాలను పంపణీ చేసి హడావిడి చేసిన అధికారులు... వేలాది మంది నాలుగు రోజులుగా ముంపులోనే మగ్గిపోతున్నా వారిని ఆదుకోవడంలో ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో ఎక్కడా కిరోసిన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో మండల స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చింతూరు మండల కేంద్రంలోని నిత్యావసర సరుకుల గోడౌన్ ఇంచార్జి వేరే చోటకు వెళ్లిపోవటంతో అక్కడి బాధితులకు సరుకులు అందలేదు. నాలుగు రోజులుగా గ్రామాలు నీళ్లలోనే ఉన్నప్పటికీ ప్రజల బాధలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తప్పుతున్న లెక్కలకు బాధ్యులెవరు...
ముంపు ప్రాంతాల్లో 94 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రకటించారు. కానీ చాలా చోట్ల శిబిరాలు లేక బాధితులు ఇళ్లలోనే ఉంటున్నారు. వాజేడు మండలంలో ఒక్క నాగారం పాఠశాలలోనే.. అది కూడా ఒకరోజు మాత్రమే శిబిరం పెట్టారు. దూలాపురంలో శిబిరం పెట్టినా బాధితులు ఏమీ ఇవ్వలేదు. చింతూరు మండలంలో ఆదివారం బాధితులకు బియ్యం ఇవ్వలేదు. బండారు గూడెంలో ఇప్పటి వరకూ కిరోసిన్ ఇవ్వనేలేదు. ఏజే కోడేరు హైస్కూల్లో అసలు శిబిరమే లేదు. కానీ కలెక్టర్ ఇచ్చిన నివేదికలో శిబిరం ఉన్నట్లు చూపించారు. వెంకటాపురం మండలం చిరుతపల్లిలో ఒక్కరోజు మాత్రమే శిబిరం నిర్వహించారు. కూనవరం మండల కేంద్రంలో అనేక మంది బాధితులు ఇంటి డాబాలపై ఎక్కి కాలం గడుపుతున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించే విషయంలో అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదు. ఇక్కడ బియ్యం, పాలపొడి ఇస్తున్నప్పటికీ వండుకొని తినే పరిస్థితి లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంత నిర్లక్ష్యమా..!
Published Mon, Aug 5 2013 5:53 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM