కూనవరం/వీఆర్‌పురం, న్యూస్‌లైన్: వరదలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక జిల్లాలో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. వరదల వల్ల ఆస్పత్రికి తరలించడం ఆలస్యమవడంతో ఇద్దరు మరణించగా ఒకరు వైద్యశాలలోనే కనుమూశారు. కూనవరం మండలకేంద్రంలో ఇద్దరు, వీఆర్‌పురం మండలం ధర్మతాళ్లగూడెంలో ఒకరు మరణించారు. వీరిలో ఒకరు పురుషుడు కాగా మరో ఇద్దరు మహిళలు. గోదావరి వరదలు ముంచెత్తడంతో కూనవరంలోని పున రావాకేంద్రానికి తరలివెళ్లిన షేక్‌మీరా (76) అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ప్రైవే ట్ ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స నిర్వహించి కూనవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. నర్సు వైద్యం అందిస్తుండగానే మృతిచెం దాడు. కూనవరం మండలం టేకులబోరుకు చెందిన మహిళ సూరం కమల (50) అనారోగ్యానికి గురైంది. ఆమెను మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వరదలు ముంచెత్తాయి. రాత్రి సమయంలో పడవలు లేకపోవడంతో వైద్యం చేయించడం ఆలస్యమైంది. ఈలోగానే ఆమె మృతిచెందింది. వీఆర్‌పురం మండలం ధర్మతాళ్లగూడెం గ్రామానికి చెందిన సోందె ముత్తమ్మదీ ఇదే పరిస్థితి. ఆదివారం మధ్యాహ్న భోజన అనంతరం అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు రేఖపల్లి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ముత్తమ్మ మృతిచెందింది.
అధికారుల నిర్లక్ష్యం
వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ముగ్గురు ప్రాణాలు విడిచారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అతికష్టం మీద ఆస్పత్రికి తరలించిన షేక్ మీరాకు సకాలంలో వైద్యం అందించివుంటే బతికేవాడని, వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే అతను మరణించాడని అతని కుటుంబసభ్యులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. వరదల సమయంలో లాంచీలు, పడవలు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు మిన్నకుండటం వల్లే కమల, ముత్తమ్మ చనిపోయారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వరద సహాయక చర్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉసురు తీసిన వరద
Published Mon, Aug 5 2013 5:49 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM