‘దొంగ’ తెలివి
- ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దొంగ వాహనాలే అధికం
- నిద్రమత్తులో జిల్లా రవాణా శాఖ
- సరిహద్దు ప్రాంతాల్లో తూతూమంత్రంగా తనిఖీలు
- యథేచ్ఛగా అడవిలోకి వాహనాలు
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం తరలింపులో తమిళనాడు, కర్ణాటకకు చెందిన స్మగ్లర్లు దొంగ తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. దుంగల రవాణాకు దొంగిలించిన, తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లు వేసుకున్న వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవే వాహనాల్లో శేషాచలం కొండల్లోని అటవీ సమీప గ్రామాల వరకు ఎలాంటి ఆటంకమూ లేకుండా వచ్చేస్తున్నారు. స్మగ్లర్లు అడవుల వరకు యథేచ్ఛగా వాహనాల్లో వస్తుండడం పోలీసు, అటవీ శాఖలకు సవాల్‌గా మారుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో రవాణా శాఖ రోజువారి తనిఖీలు నిర్వహించకపోవడం ఒక కారణంగా తెలుస్తోంది. తనిఖీలు ని ర్వహించినా సరైన వివరాలు లేని వాహనాలను డబ్బుతీసుకుని దళారుల ద్వారా వదిలేస్తుండడం ప్రధాన కారణమని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రవాణా శాఖ వైఫల్యం ఇలా..
శేషాచలం కొండల్లో ఎర్రచందనం నరి కేందుకు కూలీలు ఎక్కువగా తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, సేలం జిల్లాల నుంచి వస్తున్నారు. వీరు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుమల కొండల్లోని చామల, బాలపల్లె, మామండూరు అటవీ రేంజ్‌ల్లో ప్రవేశిస్తున్నారు. కర్ణాటక స్మగ్లర్లు బెంగళూరు రూరల్ నుంచి మదనపల్లె, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల మీదుగా పీలేరు సమీపంలోని తలకోన అటవీ ప్రాంతానికి చేరుతున్నారు.
వీరు ప్రయాణం చేసేందుకు కార్లు, మినీ లారీలు, టెం పోలు, ట్రక్కులు, అంబులెన్స్‌లు, టాటా సుమోలు, ఇన్నోవాలు, టాటా సఫారి వంటివి వాడుతున్నారు. ఈ వాహనాల్లో కొన్నింటికి ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్లు కరిపించి స్మగ్లింగ్‌కు ఉపయోగించిన సందర్భాలున్నాయి. అంబులెన్స్‌ల్లోనూ ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు.
ఈ వాహనాలను జిల్లా సరిహద్దుల్లో (రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో) తనిఖీ చేస్తే ఎర్రచందనం అక్రమ రవాణాకు తొలి దశలోనే అడ్డుకట్ట వేయవచ్చు. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాహనాలకు సరైన రికార్డులు లేకపోయినా పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో డబ్బులు తీసుకుని వదిలేస్తుండడం వల్లే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఏడాదిలో 200 వాహనాల స్వాధీనం
తిరుపతి అటవీ సర్కిల్‌లో డీఎఫ్‌వో వైల్డ్‌లైఫ్, డీఎఫ్‌వో ఈస్ట్ పరిధిలో, అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు పోలీసు జిల్లాల్లో 2014 సంవత్సరంలోనే రెండు వందల కుపైగా వాహనాలను అటవీశాఖ, పోలీ సులు సీజ్ చేశారు. ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక, తమిళనాడు బోగస్ రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్నవే కావడం గమనార్హం. ఈ వాహనాలన్నీ అటవీ స మీప మార్గాల్లో ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తూ పట్టుబడినవే. రవాణా శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ వాహనాలు తప్పు డు రికార్డులతో జిల్లా లోపలి వరకు రాగలుగుతున్నాయనేది పోలీసు, అటవీ శాఖ అధికారుల విశ్లేషణ. ఈ కోణంలో ప్రభుత్వం గట్టి చర్యలు చేపడితే స్మగ్లర్ల ఆట కట్టించవచ్చని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.