రచ్చబండ దరఖాస్తులకు దిక్కేది ? | Referring to apply in order to ensure justice? | Sakshi
Sakshi News home page

రచ్చబండ దరఖాస్తులకు దిక్కేది ?

Published Fri, May 23 2014 1:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రచ్చబండ దరఖాస్తులకు దిక్కేది ? - Sakshi

రచ్చబండ దరఖాస్తులకు దిక్కేది ?

రచ్చబండ-3లో అందిన దరఖాస్తుల సంఖ్య లక్షా 55 వేలు
 
 ఏలూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కోసం అందించిన దరఖాస్తులు దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్నాయి. రచ్చబండ-3లో వివిధ పథకాల కోసం  అందిం చిన దరఖాస్తులను టీడీపీ సర్కారైనా పట్టించుకుంటుందా అన్న అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.

గతేడాది నవంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన రచ్చబండ-3లో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, సామాజిక పింఛన్లు, బంగారుతల్లి పథకాలకు 1,54,952 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయో అర్థంకాని అయోమయ స్థితిలో దరఖాస్తుదారులు కొట్టుమిట్టాడుతున్నారు. దరఖాస్తులను వడపోసి జాబితాల తయారీలో ఉండగా రాష్ట్ర విభజన సెగ ఉద్యోగ వర్గాలను, ప్రభుత్వాన్ని తాకింది.
 
 ఉద్యమాలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. అనంతరం వాటిని గాడిన పెడదామనే సరికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనందుకు కోర్టు మొట్టికాయలు వేయడంతో కాంగ్రెస్ సర్కార్ వదిలేసింది. మరికొద్ది రోజుల్లో టీడీపీ సర్కార్ కొలువుతీరనుంది. ఇప్పటికే దరఖాస్తు చేస్తుకున్న వారికి లబ్ధి చేకూరుస్తుందా? లేదా రచ్చబండకు పేరు మారుస్తారా? అనే అనుమానం లబ్ధిదారులను పట్టిపీడిస్తోంది. ఇదిలావుంటే అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము నడుచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
 
 దరఖాస్తుదారులకు న్యాయం జరిగేనా ?
 జిల్లాలో మూడో విడత రచ్చబండలో రేషన్ కార్డుల కోసం 68,388 మంది, పెన్షన్లు కోసం 45,407 మంది, ఇళ్లస్థలాలు కోసం 39,855 మంది, బంగారు తల్లి పథకానికి 1,700 మొత్తం 1,54,952 మంది దరఖాస్తుదారులు టీడీ పీ సర్కార్ తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. మరోవైపు  రచ్చబండ సందర్భంగా రూ.3 కోట్లను ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిల చెల్లింపులకుగానూ గత ప్రభుత్వం ఈపీడీసీఎల్‌కు జమ చేసింది. అప్పటి నుంచి విద్యుత్ రాయితీ అతీగతీ లేదు. రచ్చబండ-3 దరఖాస్తుదారులకు సత్వర న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement