బహిరంగ కిక్కు..! | Reflecting bar liquor stores | Sakshi
Sakshi News home page

బహిరంగ కిక్కు..!

Published Mon, Aug 3 2015 3:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

బహిరంగ కిక్కు..! - Sakshi

బహిరంగ కిక్కు..!

జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మద్యం దుకాణం ఓపెన్ బార్‌ను తలపించే విధంగా ఉంటుంది. కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్ పక్కనే రెండు మద్యం దుకాణాలున్నాయి. దుకాణాలకు ముందు తడికలు అడ్డం కట్టి బహిరంగంగానే మద్యం తాపిస్తున్నారు.
 
కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని లాడ్జి దగ్గర మద్యం దుకాణం ఉంది. ఆ దుకాణం నుంచి లాడ్జిలో పనిచేసే బాయ్స్ భారీ మొత్తంలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇక్కడ మద్యం దొరుకుతుంది.
 
- రోడ్లపైనే మందుకొట్టుడు
- బార్లను తలపిస్తున్న మద్యం దుకాణాలు
- నిబంధనలు బేఖాతర్
- ఆరుబయటే గ్లాసుల మోత
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు
కర్నూలు:
జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధన ఉంది. కర్నూలు నగరంలోనే చెన్నమ్మ సర్కిల్ వద్ద రెండు దుకాణాలు, కృష్ణానగర్ ఐటీసీకి ఎదురుగా రెండు దుకాణాలు జాతీయ రహదారికి ఆనుకొని ఏర్పాటుచేశారు. సాయంత్రం అయితే చాలు. పెద్ద సంఖ్యలో మందు బాబులు ఆయా దుకాణాల వద్ద గుమికూడుతున్నారు. సర్వీసు రోడ్లను సైతం ఆక్రమించి వాహనాలు పార్క్ చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద మద్య సేవనం ఆరుబయటే జరుగుతోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..
 
ఇలాంటివి జిల్లాలో అనేకం ఉన్నాయి. జిల్లాలో 175ప్రైవేట్ దుకాణాలు, 19 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ దుకాణదారులు ప్రభుత్వానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ రూముకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే 30కిపైగా దుకాణాల్లో ఇప్పటి వరకు పర్మిట్ రూములకు అనుమతి తీసుకోకుండానే మద్యం తాపిస్తున్నారు. ఐదు వేలలోపు జనాభా ఉన్న దుకాణాలకు పర్మిట్ రూము అవసరం లేదన్న నిబంధనను అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ అధికారులు మామూళ్లు దండుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా నిబంధనల మేరకే సుంకేసుల, చిన్నటేకూరు గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
 
జోరుగా లూజు విక్రయాలు..
వైన్‌షాపుల్లో లూజు విక్రయాలు నిషేధం. అలాగే దుకాణం ఎదుట మద్యం తాగడం కూడా నిబంధనలకు విరుద్ధమే అనుమతి గదుల్లో మాత్రమే మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ఎదుటనే గుంపులుగా గుమికూడి మద్యం సేవిస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. వైన్ షాపుల ముందు చికెన్ పకోడి బండ్లు, మటన్ కడ్డీలు (చీకులు), చేపలు తదితర తిను బండారాలను ఏర్పాటు చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.
 
మీతో మీ ఎస్పీకి ఫిర్యాదుల వెల్లువ: ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి బహిరంగ మద్యపానం విషయంపై భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి కనీసం 3,4 ఫిర్యాదులు బహిరంగ మద్యపానం, నాటుసారా వ్యాపారం పైనే ఫిర్యాదులు వస్తున్నాయి. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తప్ప పరిష్కరించిన దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ముందు నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని స్వయంగా మహిళలే ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. పోలీసు బాసు గట్టిగా ఆదేశించినపుడు మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు.

మద్యం వ్యాపారుల నుంచి నెలవారి మామూళ్లు పంచుతున్నందునే అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైన్‌షాపుల ముందు రోడ్లపైన మద్యం తాగనివ్వకుండా ఎక్సైజ్‌శాఖ నియంత్రించాల్సి ఉంది. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుకాణం వద్ద ఓపెన్ బార్‌ను తలపించే విధంగా మద్యపానం సేవిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూసే వారు కూడా కరువయ్యారు. క్షేత్రస్థాయి అధికారుల్లో చిత్తశుద్ధి లేనపుడు ఉన్నతాధికారులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి అమలు కావు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన విషయంలోనూ పోలీసు బాసు కిందిస్థాయి అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరించినా, సమావేశాల్లో గట్టిగా ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement