నగర, పట్టణాల్లో సంస్కరణలు అమలుచేస్తూనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పురపాలక శాఖ జాయింట్ డెరైక్టర్(జేడీ) శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ర్ట పురపాలక శాఖ జేడీ శ్రీనివాస్‌రెడ్డి
సర్వీస్ లెవల్ బెంచ్ మార్క్‌పై రీజినల్ స్థాయి వర్క్‌షాపు
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : నగర, పట్టణాల్లో సంస్కరణలు అమలుచేస్తూనే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పురపాలక శాఖ జాయింట్ డెరైక్టర్(జేడీ) శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్‌లోని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో సర్వీస్ లెవల్ బెంచ్ మార్క్‌పై వరంగల్ రీజినల్ స్థాయి వర్క్ షాపు గురువారం జరిగింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఇంజినీర్లు, అధికారులు పాల్గొనగా, ఆయా నగరాల్లో ప్రస్తుతం అందిస్తున్న కనీస సౌకర్యాలు, రాబోయే ఏడాది ప్రగతి సూచకాలపై వివరాలను పురపాలక శాఖ అధికారులు తెలుసుకున్నారు.
అనంతరం జేడీ మాట్లాడుతూ 13 ఆర్థిక సంఘం నిబంధనల్లోని 8వ సవరణ కోసం ప్రగతి సూచికాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే తప్పనిసరిగా మునిసిపాలిటీల్లో సంస్కరణలు అమలు చేయాల్సిందేనన్నారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్క్‌లోని 26 సేవల్లో భాగంగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, సీవరేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, మురికి కాల్వల నిర్వహణపై వివరాలను నివేదికల రూపంలో స్వీకరించారు. రీజినల్ డెరైక్టర్ రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి నివేదికలను కౌన్సిల్ తీర్మానం చేసి సమర్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో పురపాలక శాఖ అధికారి వేణుగోపాల్, వరంగల్ బల్దియా ఎస్‌ఈ ఉపేంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు.
నిధులతో లింకు
వరంగల్ కార్పొరేషన్‌కు 13 ఆర్థిక సం ఘం ద్వారా నిధులు విడుదల చేయాలంటే కొన్ని సంస్కరణలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాల్సిన సంస్కరణలపై సర్వీస్ లెవల్ బెంచ్ మార్క్ విడుదల చేసింది. వీటిని అమలు చేయాలంటూ రాష్ట్ర మునిసిల్ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలపైనే కాకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, సీవరేజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ప్రతీ మనిషికి 100 లీటర్ల నీరు
ప్రస్తుతం వరంగల్ నగరంలో 69.70శా తం నగర ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి 80శాతం మందికి నీటి సరఫరా చేస్తామని కార్పొరేషన్ ఇంజినీర్లు తెలిపారు. అయితే, నిబంధనల ప్రకారం ప్రతీ మనిషికి ప్రతిరోజు 135లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా, ప్రస్తుతం 100 లీటర్ల అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది 120లీటర్ల నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గంట పాటు నీరు ఇస్తున్నామని, ఇదే పద్ధతిని కొనసాగిస్తామని వివరించారు. అలాగే, నగరంలోని ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ 81 శాతం జరుగుతోం దని, వచ్చే ఏడాది దీనిని 90శాతానికి పెంచుతామని అధికారులు తెలిపారు. కాగా, మురుగునీటిని శుద్ధి చేయడం లేదని పేర్కొంటూ ప్రగతి నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు.