
చెట్టు కింద చలిలో వణుకుతున్న వృద్ధుడు ,వృద్ధుడికి దుప్పటి కప్పి ఆహారం ఇచ్చిన వాకర్స్
తూర్పుగోదావరి,సామర్లకోట: ఆ వృద్ధుడు ఎవరికి భారమయ్యాడో కానీ అనాథగా ఓ చెట్టు కింద ఇలా కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. సామర్లకోట మండలం ఉండూరు రోడ్డులో రైల్వే గేటు సమీపంలోని ఓ చెట్టు కింద సుమారు 70 ఏళ్ల వృద్ధుడు పడి ఉన్నాడు. ఆ రోడ్డులో సాయంత్రం వాకింగ్ చేస్తున్న వారు ఇది గమనించి మద్యం సేవించి పడిపోయి ఉంటాడని భావించారు. సాయంత్రం కూడా అతడు అలాగే చలిగాలికి వణికిపోతూ కనిపించడంతో వాకర్స్ చలించిపోయారు.
ఆ వృద్ధుడికి దుప్పటి ఇచ్చి తాగునీరు, ఆహారం అందించారు. ఈ వృద్ధుడిని మూడు రోజుల క్రితం మోటారు సైకిల్‌పై వచ్చిన వారు వదిలి వెళ్లి పోయారని సమీపంలో ఉన్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. మద్యం మత్తులో ఉండడం వల్ల విడిచి వెళ్లారని భావించామని తెలిపారు. అయితే వృద్ధుడి నుంచి సమాచారం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట స్పష్టంగా రావడం లేదు. అయితే గ్రామం మాత్రం మాధవపట్నం అని చెప్పగలిగాడు. ఈ పెద్దాయనను ఎవరో కర్కశులు ఈ విధంగా చలిలో వదిలి వెళ్లిపోవడంతో స్థానికుల హృదయాలు చలించిపోయాయి. పోలీసులు ఈ వృద్ధుడిని రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment