జైలు నుంచి విడుదలై భారత్‌కు తిరిగివస్తున్న మత్స్యకారులు
సాక్షి, అమరావతి/ పూసపాటిరేగ/ డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డులకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన 8 మంది మత్స్యకారులు గతేడాది సెప్టెంబర్ 27న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. సముద్రంలోబోటు మరమ్మతులకు గురికావడం, భారీ గాలుల కారణంగా అక్టోబర్ 2న భారత్ బోర్డర్ దాటి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కి నాలుగు నెలలు జైలు జీవితం గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుల కృషితో బుధవారం ఉదయం 10 గంటలకు బంగ్లాదేశ్‌లో భగీరహట్ జైలు నుంచి మత్స్యకారులు మారుపల్లి పోలయ్య(43), ఆర్.అప్పన్న (38), వాసుపల్లి అప్పన్న (24), మారుపల్లి నరసింహ (45), వాసుపల్లి దానయ్య(51), వాసుపల్లి అప్పన్న (41), ఆర్.రాములు (24), బి.రాము (31) విడుదలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది జాలర్లు ఇటీవలే పాక్ జైలు నుంచి విడిపించి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ జాలర్ల కుటుంబాలు నాలుగు నెలలుగా అర్థాకలితో అలమటిస్తున్నాయి. వాసుపల్లి దానయ్య భార్య మంచం పట్టి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బర్రి రాము కుమార్తెకు నాన్న మీద బెంగతో జ్వరం పట్టుకుంది. వాసుపల్లి దానయ్య కుమారుడు రెండు నెలలుగా స్కూల్‌కి వెళ్లడం లేదు. ఈ కుటుంబాలన్నీ గత నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
నాన్న కోసం పిల్లలు సముద్రం వైపే చూస్తున్నారు..
నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. పిల్లలకు క్యారేజ్ కట్టడానికి కూడా డబ్బుల్లేవ్. ఇంటి పనులు చేసుకుంటూ సాయంత్రం ఇంటి యజమాని ఇచ్చే ఆహారాన్ని పిల్లలకి పెడుతున్నా. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా.. అంటూ పిల్లలు నిత్యం సముద్రం వైపే చూస్తున్నారు. జగనన్న సహకారంతో నా భర్త తిరిగి వస్తున్నట్టు సమాచారం అందింది. ఆనందానికి అవధుల్లేవ్..
– బర్రి ఎర్రమ్మ, బర్రి రాము భార్య
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషితోనే..
బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన మత్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో ఆ దేశం విడుదల చేసింది. రెండు మూడు రోజుల్లో వీరంతా స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి చొరవతో ఇప్పటికే పాకిస్థాన్ నుంచి మత్స్యకారులు విడుదల కాగా.. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా విడుదలవుతున్నారు. మత్స్యకారులపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
– మోపిదేవి వెంకటరమణారావు, మత్స్యశాఖ మంత్రి
జగనన్నకు రుణపడి ఉంటాం..
ఈ జీవితం ఉన్నంత వరకు సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం. నాలుగు నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త రాములు బందీ అయ్యాడు. పాకిస్తాన్‌లో బందీలుగా చిక్కిన మత్స్యకారులను విడిపించడంతో మాలో ఆశలు చిగురించాయి. అనుకున్నట్టుగానే నా భర్తను విడిపించారు. జగనన్నకు కృతజ్ఞతలు.
– రాయితి దానయ్యమ్మ(రాములు భార్య), తిప్పలవలస
Comments
Please login to add a commentAdd a comment