సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు 2013–14 సవరించిన అంచనాల ప్రకారం అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని కలుసుకున్న బాబు.. ప్రాజెక్టుకు అయ్యే రూ.54 వేల కోట్ల నిధులను కేంద్రం త్వరితగతిన విడుదల చేయాలని విన్నవించారు. 2013–14 లెక్కల ప్రకారం ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.54 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఇందులో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు 2010–11లో రూ. 2,934 కోట్లు అంచనా కాగా, 2013–14 నాటికి 10 రెట్లు పెరిగి రూ.33,858 కోట్లకు చేరుకుందని చెప్పారు.
తాజా లెక్కల ప్రకారం మొత్తం ప్రాజెక్టుకు అయ్యే రూ.58 వేల కోట్లలో పవర్ హౌస్‌కు అయ్యే రూ.4 వేల కోట్లను మినహాయించి మిగతా మొత్తాన్ని కేంద్రం భరించాలని జైట్లీని కోరినట్టు చంద్రబాబు మీడియాకు తెలిపారు. ఈ నిధులను విడుదల చేయడానికి జైట్లీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రం నుంచి రూ.2,829 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. ఈ నిధులను వారంలో విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు. పోలవరం పురోగతిపై సమీక్షించడానికి కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చే నెల 3న రాష్ట్రానికి వస్తారన్నారు. కాగా టీటీడీకి, పైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జైట్లీని కోరినట్లు సీఎం చెప్పారు.
ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి
పుస్తకాలు రాసే సమయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కంచ ఐలయ్య వివాదంపై చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక వర్గాన్ని దూషిస్తూ రాయడం మంచిదికాదని, ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆయన పుస్తకం మార్కెట్లో అందుబాటులో లేదని చెప్పారు. ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ డా.రజత్‌భార్గవ్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ సభ్యుడు డా.డీఎన్.పతక్ రచించిన ‘స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఆర్థిక నిర్వహణ’ పుస్తకాన్ని జైట్లీ ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి జైట్లీ ముందుమాట రాశారు.
Published Wed, Sep 27 2017 2:10 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement