పర్యాటకంలో అధిక రాబడులు
- ‘టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో చంద్రబాబు
- ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: పర్యాటక రంగంలో పెట్టుబడులు అధిక రాబడులను అందిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజమ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2016’లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని పలు చిన్న దేశాలు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంటే మన దేశం ఆ మేరకు పర్యాటకులను ఆకర్షించలేకపోవడంపై ఆందోళన వ్యక్తం చే శారు. దేశంలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. సేవా రంగానికి పర్యాటక రంగం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు.
ఏపీ అనుసరిస్తున్న మిషన్ మోడ్ విధానం వల్ల దేశంలో ఉన్న మొత్తం కార్పొరేట్ పెట్టుబడుల్లో 16 శాతం ఏపీ ఆహ్వానించిందని చెప్పారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య 30 శాతానికి పెరిగిందని, విదేశీ పర్యాటకుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘ల్యాండ్ లీజ్ పాలసీ’ని వివరిస్తూ ప్రభుత్వ భూముల కేటాయింపులో ఈ విధానం పెట్టుబడుదారుల ప్రాధాన్యానికి, పోటీకి సమతుల్యం పాటిస్తుందని చంద్రబాబు చెప్పారు. భూమి లీజు అద్దె మార్కెట్ విలువకు 2 శాతం తక్కువగా ఉందన్నారు. టూర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు.
తాజా అంచనాల ప్రకారం నిధులివ్వాలి: బాబు
పోలవరం ప్రాజెక్టుకు పాత అంచనా వ్యయం ఆధారంగా కాకుండా తాజా అంచనా మేరకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, జలవనరుల మంత్రి ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు మధ్యాహ్నం అరుణ్‌జైట్లీని కలసి పోలవరంపై చర్చించారు. అలాగే ఇటీవల కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన ఆర్థిక సాయంలోని అంశాలను కేబినెట్ ముందుంచి ఆమోదింపజేయాలని, అవసరమైన అంశాలకు చట్టబద్ధత కల్పించాలని కోరినట్టు సమాచారం. అపెక్స్ కౌన్సిల్ సమావేశానంతరం ఉమాభారతితో చంద్రబాబు భేటీ అయ్యారు.