సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి, అక్రమాలను తెరమరుగు చేయడానికి మంగళవారం సాక్షాత్తూ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అసత్యాలను వల్లె వేశారు. ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి సూచనల మేరకే ఈ ప్రాజెక్టు పనులను నవయుగ సంస్థకు అప్పగించామని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని తాను కోరలేదని, నీతిఅయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్రమే అప్పగించిందని పాత పల్లవిని అందుకున్నారు. ‘‘డబ్బుల కోసమే పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్నానని ఇద్దరు నాపై విమర్శలు చేస్తున్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా అంగీకరించానని ఆరోపిస్తున్నారు.
సున్నితమైన సమస్యలపై ఇలా మాట్లాడొద్దు. చేతులు పెడితే కాలిపోతాయి’’ అంటూ రుసరుసలాడారు. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతన్నది పరిశీలిస్తే... పోలవరం జలాశయం పనులను నవయుగ సంస్థకు అప్పగించడంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాత్ర లేదన్నది ఇట్టే అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీపీ) అనుమతి లేకుండా అంచనా వ్యయాన్ని రూ.286.98 కోట్ల మేర పెంచేసి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే... తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పాత ధరలకే పనులు చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని నమ్మబలికి, నామినేషన్ విధానంలో ఆ సంస్థకు కట్టబెట్టాలని కేబినెట్‌లో సూత్రప్రాయంగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర, కేంద్ర మంత్రి గడ్కరీ పాత్ర ఎక్కడుంది? రాష్ట్ర సర్కారు కోరింది కాబట్టే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను అప్పగించామని కేంద్రం రెండుసార్లు విస్పష్టంగా ప్రకటించినా, చంద్రబాబు మాత్రం నాలుక మడతేశారు. నీతిఆయోగ్ సిఫార్సుల ప్రకారమే తమకు అప్పగించారంటూ పాతపాట పాడారు.
నిబంధనలకు నీళ్లు
పోలవరం ప్రాజెక్టు జలాశయం(హెడ్ వర్క్స్) పనుల్లో 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించిన పనులకు రూ.1,395.30 కోట్లతో ఎల్‌ఎస్ ఓపెన్ పద్ధతిలో నవంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు.. ఆ పనులు నవయుగ సంస్థకే దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని అప్పట్లో విమర్శలొచ్చాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆమోదం లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కుతూ జారీ చేసిన ఈ టెండర్ నోటిఫికేషన్‌ను నిలిపివేయాలంటూ నవంబర్ 27న కేంద్రం లేఖ రాయడంతో కలకలం రేగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. అంచనా వ్యయాన్ని రూ.1,483.22 కోట్లకు పెంచేసి మరీ నవంబర్ 30న ‘ఈ–ప్రొక్యూర్‌మెంట్’ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కన్నెర్ర చేశారు.
అదనపు భారం ఎవరు భరిస్తారు?
టెండర్ల వివాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డిసెంబర్ 13న నిర్వహించిన సమావేశంలో పాత కాంట్రాక్టర్‌కు నెల రోజుల సమయం ఇవ్వాలని.. ఆ లోగా నిర్దేశించిన మేరకు పనులు చేయకపోతే, అప్పుడు తాజా టెండర్ అంశాన్ని పరిశీలిస్తామని తేల్చిచెప్పారు. గడ్కరీ ఇచ్చిన గడువు ముగుస్తున్నా పనుల్లో ఏమాత్రం పురోగతి లేదని, టెండర్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జనవరి 4న రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. పీపీఏ గెజిట్ నోటిఫికేషన్‌లోని నిబంధనలను గుర్తు చేస్తూ.. టెండర్ అంశంపై నిర్ణయాధికారం పీపీఏకే ఉందని, అక్కడే తేల్చుకోలని రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి 5న యూపీ సింగ్ సూచించారు. దాంతో జనవరి 11న సీఈవో సౌమిత్రి హల్దార్ పీపీఏ సమావేశం నిర్వహించారు. 60సీ కింద విడదీసిన పనుల విలువ రూ.1196.24 కోట్లు కాగా, దాన్ని రూ.1,483.22 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారని, అదనంగా పడే రూ.286.98 కోట్ల భారాన్ని ఎవరు భరిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీపీఏ నిలదీసింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చాకే టెండర్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
పాత ధరలకే చేస్తుందట!
అంచనా వ్యయం పెంపు వెనుక గుట్టు రట్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. పాత ధరలకే పనులు చేయడానికి నవయుగ సంస్థ ముందుకొచ్చిందంటూ జనవరి 17న మీడియాకు లీకులిచ్చింది. 60సీ కింద విడదీసిన పనులను నవయుగకు నామినేషన్ విధానంలో కట్టబెట్టాలని జనవరి 20న మంత్రివర్గ సమావేశంలో అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అనంతరం జనవరి 30న ఢిల్లీలో నితిన్ గడ్కరీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, పాత ధరలకే చేయడానికి ముందుకొచ్చిన నవయుగకు నామినేషన్ విధానంలో పనులు అప్పగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎలాంటి అదనపు భారం పడబోదని చెప్పడంతో ఆ ప్రతిపాదనకు నితిన్ గడ్కరీ అంగీకరించారు. కానీ, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా.. కేంద్ర మంత్రి సూచనల మేరకే ప్రాజెక్టు పనులను నవయుగ సంస్థకు కట్టబెట్టామని పేర్కొన్నారు.
కేంద్రం చెప్పిందేమిటంటే..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని తాము అడగలేదని.. నీతిఆయోగ్ సిఫార్సుల ప్రకారం కేంద్రమే అప్పగించిందని చంద్రబాబు అసత్యాలు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో గానీ.. 2016 సెప్టెంబరు 8న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ప్రకటనలో గానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించినట్లు స్పష్టంగా ఉంది. కానీ, సీఎం చంద్రబాబు శాసనసభ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment