కష్టాల కడలిలో గంగపుత్రులు | Relief cum savings scheme not implemented | Sakshi
Sakshi News home page

కష్టాల కడలిలో గంగపుత్రులు

Published Sun, May 11 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

Relief cum savings scheme not implemented

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రిలీఫ్ కం సేవింగ్స్ పథకం వారికి అక్కరకు రాకుండా పోయింది. మత్స్యకారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రెండేళ్ల నుంచి ప్రభుత్వాలు తమ వాటా ధనం చెల్లించకపోవడంతో మత్స్యకారుల వాటా నగదు మూలుగుతోంది. కీలక సమయంలో వారికి పథకం అందకుండా పోయింది.  రిలీఫ్ కం సేవింగ్స్ పథకాన్ని ప్రభుత్వాలు రిలీఫ్ ‘నాట్’సేవింగ్స్‌గా మార్చేశాయి. జిల్లాకు చెందిన వేలాది మంది మత్స్యకారులు రిలీఫ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31వ తేదీ వరకు వేట నిషేధిస్తోంది. ఆ కాలంలో చేపలు గుడ్లు పెడతాయి. మత్స్యకారులు వేట సాగించే సమయంలో గుడ్లు దెబ్బతిని సముద్ర సంపదకు నష్టం కలుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 46 రోజులపాటు వేట నిషేధించింది. సముద్రంపై వేటే జీవనాధారం చేసుకున్న మత్స్యకారులకు మరో ఉపాధి లేకపోవడంతో నిషేధ సమయంలో ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం రిలీఫ్ కం సేవింగ్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మత్స్యకారుడు 600 రూపాయలు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 600 రూపాయలు చొప్పున వాటా ధనంగా జమ చేస్తాయి. వేట నిషేధం రోజునే ఈ నగదు చెల్లిస్తే మత్స్యకారుల కుటుంబాలకు కొంతమేర ఆసరా ఉంటుంది.  
 
 రూపాయి విదిల్చితే ఒట్టు
 రిలీఫ్ కం సేవింగ్స్ పథకం కింద రెండేళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి విదల్చలేదు. పెపైచ్చు కేంద్రం విడుదల చేస్తే రాష్ట్రం మిన్నకుండటం.. రాష్ట్రం విడుదల చేస్తే కేంద్రం చోద్యం చూడటం పరిపాటిగా మారింది. ఆ మొత్తం కూడా స్వల్పమే అయినా వారికిచ్చేందుకు పాలకులకు చేతులు రాలేదు. జిల్లాలోని 11వేల మందికి పైగా మత్స్యకారులు వాటా ధనం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. దాదాపు 11,225 కుటుంబాలు వేట జీవనాధారం చేసుకున్నాయి. అనేక మంది మత్స్యకారులు రిలీఫ్ కం సేవింగ్స్ కోసం రెండేళ్ల నుంచి ఒంగోలులోని మత్స్యశాఖ సహాయ సంచాలకుని కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి ఆశలు వదులుకున్నారు. చివరకు కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement