లాక్‌డౌన​: గూడ్స్‌ వాహనాలకు ఉపశమనం | Relief for Goods vehicles throughout the country | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ వాహనాలకు రైట్‌.. రైట్‌..

Published Tue, Apr 14 2020 4:33 AM | Last Updated on Tue, Apr 14 2020 10:07 AM

Relief for Goods vehicles throughout the country - Sakshi

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: లాక్‌డౌన్‌లో చిక్కుకున్న లారీలు, అన్ని రకాల గూడ్స్‌ వాహనాలకు ఉపశమనం కలిగేలా కేంద్రం హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వీటిని నిరాటంకంగా అనుమతించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంవల్ల నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది లేకుండా పోవడమే కాకుండా పోర్టుల నుంచి, ఇతర కర్మాగారాల నుంచి సరుకుల రవాణా సులభతరం కానుంది. లాక్‌డౌన్‌వల్ల గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ తరహా లారీలు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయాయి. ఉదాహరణకు.. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, స్టీల్, పరిశ్రమలకు అవసరమైన సామగ్రి తదితర వాటితో ఉన్న అన్ని వాహనాలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. అలాగే..

► అంతరాష్ట్ర చెక్‌ పోస్టుల వద్ద నిత్యావసరాల వాహనాలను తప్ప మిగిలిన వాహనాలు వేటినీ ఆయా రాష్ట్రాల్లో పోలీసులు అనుమతించడంలేదు.  
► ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వంటి గూడ్స్‌ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. 
► ఇతర రాష్ట్రాలకు పంట ఉత్పత్తులతో పాటు పరిశ్రమలకు చెందిన సామగ్రిని రవాణా చేసేందుకు వీలు ఏర్పడింది. 
► రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులను ప్రస్తుతం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఏపీకి మరింత వెసులుబాటు కల్పించినట్లయింది. 

ఖాళీ లారీలకూ లైన్‌క్లియర్‌
సరుకుతో పనిలేకుండా ఖాళీ లారీలను కూడా అనుమతించాలని కేంద్రం ఆదేశించింది. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రానికి చెందిన సుమారు 2,500 లారీలు వివిధ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాలకు చెందిన వెయ్యికి పైగా లారీలు మన రాష్ట్రంలోనూ సరుకులతో నిలిచిపోయాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు తమతమ గమ్యస్థానాలకు బయలుదేరతాయి. అలాగే, రాష్ట్రంలో సుమారు 3 లక్షల వరకు లారీలు, సరుకు రవాణా చేసే వాహనాలున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి వీటికి ఇప్పుడు మినహాయింపు నివ్వడంతో ఇవి రోడ్డెక్కనున్నాయి. దీంతో డీజిల్‌ అమ్మకాలూ ఊపందుకుంటాయి.

డీజీపీ, రవాణా కమిషనర్‌ ఆదేశాలు
అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు అడ్డంకులు కల్పించవద్దంటూ డీజీపీ సవాంగ్, రవాణా కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు కూడా జిల్లాల పోలీస్, రవాణా అధికారులను ఆదేశించారు. ఖాళీగా Ððð ళ్లే వాహనాలనూ అనుమతించాలన్నారు. ఈ వాహనాల్లో డ్రైవర్, క్లీనరు తప్ప ప్రయాణికులను అనుమతించవద్దని స్పష్టంచేశారు.

వెసులుబాటు కల్పించడం హర్షణీయం
గూడ్స్‌ వాహనాలు నడిపేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ఈ నిర్ణయంతో సరుకు రవాణా మొదలై వ్యవస్థ గాడిలో పడుతుంది.
– వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

అన్ని వాహనాలకు అనుమతి
అన్ని రకాల వాహనాలు అనుమతించాలని రవాణా శాఖాధికారులకు ఆదేశాలిచ్చాం. పోలీస్, రవాణా అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమతిస్తారు. 
– ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్‌

వస్తువుల రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు 
వస్తువుల రవాణా వాహనాల రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టంగా చెప్పినప్పటికీ నిత్యావసరాలతోపాటు ఇతర వస్తువుల రవాణా వాహనాలను రాష్ట్రాలు అనుమతించడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత స్పష్టత ఇస్తూ రోజూ వినియోగించే ఆహారం, నిత్యావసర సరుకులన్నింటికీ లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సోమవారం లేఖ రాశారు. 

► నిత్యావసర సరుకులతోపాటు ఇతర సరుకు రవాణా వాహనాలన్నింటినీ రాష్ట్రాల మధ్య తిరిగేందుకు అనుమతించాలి. ఈ వాహనాల్లో లైసెన్స్‌ కలిగిన ఒక డ్రైవర్‌తోపాటు అదనంగా మరొకరు ఉండొచ్చు.  
► ఖాళీ గూడ్స్‌ వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వాలి.  
► అనుమతించిన పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు కార్మికులు వెళ్లడానికి ఆంక్షలు పెట్టకూడదు. 
► నిత్యావసరాలు, ఇతర సరుకు రవాణాకు రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టుల్లో కార్గో సర్వీసులను అనుమతించాలి. సరుకుల లోడింగ్, అన్‌ లోడింగ్‌ కోసం కాంట్రాక్టు కార్మికులకు కూడా జిల్లా అధికార యంత్రాంగం పాస్‌లు జారీ చేయాలి. 

నిత్యావసరాల రవాణా డ్రైవర్లకు ప్రత్యేక కిట్లు 
పంట ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల రవాణాకు అవసరమైన వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ సేకరిస్తోంది. అయితే, కరోనా వైరస్‌ భయంతో డ్రైవర్లు ముందుకు రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో డ్రైవర్‌ భద్రత, వారి కుటుంబ సభ్యుల భయాలను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం సమీకరించిన ప్రతి వాహనం నడిపే డ్రైవర్లకు డ్రైవ్‌ ప్రొటెక్షన్‌ కిట్‌లను ఉచితంగా అందించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ కిట్‌లో ఒక శానిటైజర్‌ బాటిల్, రెండు డెట్టాల్‌ సబ్బులు, ఐదు చేతి గ్లవ్స్, ఐదు ఫేస్‌ మాస్క్‌లు ఉంటాయి. ఇలాంటి 10 వేల కిట్లను రవాణా శాఖ సిద్ధం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement