వైఎస్సార్ స్మృతివనానికి గ్రహణం
ఆత్మకూరు రూరల్ (కర్నూలు జిల్లా): రాజకీయాలకు మానవీయ పరిమళాలు అద్దిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంతటి మహనీయుడు పంచభూతాల్లో కలసిన ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ పరిసరాలు ఆయన అభిమానులకు స్మరణీయాలు. ఈ స్మరణ స్మృతి శాశ్వతంగా నిలిచేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నల్లకాల్వ గ్రామ శివార్లలో వైఎస్‌ఆర్ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేసింది. 550 రకాల పుష్ప,ఫల వృక్షజాతుల సమీకరణతో స్మృతివనం జీవవైవిధ్యానికి మచ్చుతునకలా బాసిల్లుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరెక్కడా లేని అద్భుత సౌందర్య ఉద్యానవనం ఇది. ఈ స్మృతివనం ప్రతిష్ట మసకబారే పలు చర్యలు ఇటీవల చోటుచేసుకుంటుండడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన ద్వారం మూసివేత
వైఎస్‌ఆర్ స్మృతివనానికి ప్రధాన హంగు దాని సింహద్వారమే. ఈ ద్వారం వద్దకు రాగానే ఎదురుగా 30 అడుగుల మహానేత నిలువెత్తు విగ్రహం ఆశీర్వచనపు ఆహ్వానం పలుకుతుంటుంది. దీంతో సందర్శకులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇంతటి భావస్ఫోరక దృష్టితో ఏర్పాటు చేసిన సింహ ద్వారం 20 నెలలుగా మూతపడింది. అటవీశాఖ ఉద్యోగులు కేవలం సందర్శకులకు టిక్కెట్లు ఇవ్వడానికి వసతి లేదన్న విషయాన్ని సాకుగా చూపుతూ ఈ మార్గం మూసివేసి దొడ్డిదారిన సందర్శకులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వైఎస్‌ఆర్ స్మృతివనం సందర్శన ఒక భావోద్వేగపు యాత్ర. అలాంటి సందర్శనను ఏ అనుభూతులు లేని నిస్సార యాత్రగా మార్చే కుట్రలో భాగంగా దొడ్డిదారి దర్శనాలు చేయిస్తున్నారు. అయితే దొడ్డిదారిలో వైఎస్‌ఆర్ పేరు కనిపించదు. ఇక్కడ ఉన్న ఫలహార శాల పేరే పెద్దగా కనిపించే బోర్డు ఉండడం మహానేత ప్రతిష్ట మసకబార్చడం కాక మరేమిటి?
ప్రచారం శూన్యం .. నిధులు మృగ్యం
26 ఎకరాల విశాల ప్రాంగణంలో సుమారు రూ.12 కోట్లతో నిర్మించిన వైఎస్‌ఆర్ స్మృతివనం పర్యవేక్షణకు ఒక్కటంటే ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం విదల్చకపోవడం చూస్తుంటే ఇది దురుద్దేశ చర్యగా కనిపిస్తోంది. అంతేకాకుండా వైఎస్‌ఆర్ అభిమానులు తప్ప, ఇతర రాష్ట్రాల వారిని గానీ రాజకీయేతర సాధారణ ప్రజలను గానీ ఈ స్మృతివనానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతూనే ఉంది. అలాగే ఇంత పెద్ద ఉద్యానవనంలో అప్పటికప్పుడు అవసరమయ్యే పనులకోసం ఖర్చు పెట్టేందుకు కంటింజెన్సీ నిధులన్నవి లేకపోవడంతో పైపు పగిలినా, మోటారు కాలిపోయినా రోజుల తరబడి వేచి ఉండడమో లేక అక్కడ పని చేసే సిబ్బంది స్వయంగా తమ జేబులోంచి ఖర్చు చేయడమో చేయాలి తప్ప మరో మార్గం ఉండదు.
అభద్రతలో సిబ్బంది
స్మృతివనంలో వివిధరకాల పనుల్లో 30 మంది సిబ్బంది పనులు చేస్తుంటారు. వీరిలో స్వీపర్లు మొదలు తోటమాలులు, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్ వంటి పలు విభాగాల్లో పనిచేసేవారున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా, కొత్త నాయకులు తయారైనా.. మా మనుషులు వస్తారు, మీరు తప్పుకోండంటూ వీరిపై ఒత్తిళ్లు వస్తుంటాయి. వీరంతా ఆయా అధికార పీఠాలకు తామూ విధేయులమేనని నిరూపించుకునే వరకు ఈ ఒత్తిడి వారిపై కొనసాగుతూనే ఉంటుంది. దీంతో వీరు తమ ఉద్యోగ భధ్రతపై నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది వారి పని విధానంపై తప్పక ప్రభావం చూపుతుంది.