
‘నవరత్నాల’ ఎఫెక్ట్.. బెల్టుషాపుల తొలగింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో వాటిని ఎలా ఎదుర్కొవాలన్న దానిపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ విధానంపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, ప్రతిపక్ష నేత దశలవారీ మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తక్షణం తొలగించాలని నిర్ణయించింది.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర్‌ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. తాము నిర్వహించిన సర్వేలో నూతన ఎక్సైజ్ పాలసీపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇందులో భాగంగా బెల్ట్‌షాపులను తక్షణం తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్న వారిపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ వాడకంపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
► రాష్ట్రంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి నెలకు రూ.2,500 పెన్షన్ అందించాలని నిర్ణయం. ఉద్దానంతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరికీ (ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే) ఈ పథకం వర్తిస్తుంది.
► రియో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు 1,000 గజాల స్థలం కేటాయింపు.