కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జాతీయ, రాజీవ్ రహదారి డివైడర్లను అనుమతి లేకుండా తొలగిస్తే ప్రమాదాల కేసులతోపాటు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శివకుమార్ హెచ్చరించారు. శుక్రవారం హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 105 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారి ఉందని, ప్రత్యేక డిజైన్ ద్వారా డివైడర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కొన్నిచోట్ల గ్రామస్తులు వారికి అనుకూలంగా ఉండేలా డివైడర్లను తొలగించడం తో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలా రాజీవ్, రాష్ట్ర రహదారులపై మూడేళ్లలో 1900మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రహదారి భద్రతపై జనవరి 2, 3, 4 తేదీల్లో రాజీవ్ రహదారి వెంట ఉన్న పోలీస్‌స్టేషన్లలో అవగాహనసదస్సులు నిర్వహిస్తామన్నారు. రోడ్డుకు అడ్డంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దన్నారు.
బ్యాంకులు భద్రత పాటించాలి
బ్యాంకులు కనీస భద్రత పాటించాలని ఎస్పీ సూచిం చారు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఇటీవల కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంక్, ధర్మపురి సహకార పరపతి బ్యాంకుల్లో చోరీలు జరిగాయని వెల్లడించారు. దొంగతనాలు జరిగాక పోలీసులపై భారం వేయడం సరికాదన్నారు. బంగారంపై రుణాలిస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు.. ఇన్సూరెన్స్ సాకుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ, పోలీసుల సూచనలు పాటించని బ్యాంకుల్లో చోరీ జరిగితే కేసులు నమోదు చేయబోమని, ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకుంటే పోలీస్ రికార్డులో వంద శాతం రికవరీ అయినట్లు పేర్కొంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కనీసం విచారణ కూడా చేపట్టబోమని వెల్లడించారు. బ్యాంక్ లో లోపల, బయట, ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్, సూపర్‌వైజర్లు ప్రతి వారం ఆయా బ్యాంక్‌లను చెక్ చేసుకోవాలన్నారు. బంగారంపై రుణాలిచ్చే ప్రైవేటు సంస్థలు.. రుణగ్రహీతల వివరాలతోపాటు బంగారాన్ని చాలాకాలం పాటు తాకట్టుపెట్టిన వారి వివరాలను డీఎస్పీలకు ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (పరిపాలన) జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బరాయిడు, డీఎస్పీలు రవీందర్, సత్యానారాయణ, ఉదయకుమార్, పరమేశ్వర్‌రెడ్డి, నర్సయ్య, వేణుగోపాల్‌రావు, కరీంనగర్ రూరల్ సీఐ కమాలాకర్‌రెడ్డి, ఎస్‌బీఐ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు డివైడర్లు తొలగిస్తే కేసులు
Published Sat, Dec 28 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement