రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా? | Renukacaudariki Khammam tegiponunda political relationship? | Sakshi

రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా?

Aug 25 2013 4:24 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా? జిల్లాతో ఆమెకున్న 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ముగియనుందా?

ఖమ్మం, సాక్షి ప్రతినిధి:  ఏఐసీసీ  అధికార ప్రతినిధి రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా? జిల్లాతో ఆమెకున్న 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ముగియనుందా? తెలంగాణ ఆడబిడ్డనంటూ జిల్లాలో చెలాయిస్తున్న పెత్తనానికి ఇక బ్రేక్ పడనుందా? జిల్లా కాంగ్రెస్‌లోని నాయకులే ఈమేరకు అంతా సిద్ధం చేస్తున్నారా? తెలంగాణ ప్రకటన వెలువడ్డాకా జరుగుతున్న పరిణామాల క్రమంలో  జరుగుతున్న చర్చ ఇది.

1999లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పటి నుంచి రేణుకాచౌదరి ఇక్కడే తిష్టవేశారు. రెండోసారి గెలిచి కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇలా 14 ఏళ్లుగా జిల్లాలో ఆమె తిరుగులేని నాయకురాలిగా ఆధిపత్యం చెలాయించారు. కాంగ్రెస్ నేతల్ని తన కనుసన్నల్లో తిప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీచేయాలనే కోరికను పలు సందర్భాలలో ఆమె బయటపెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని ఆపార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.  తెలంగాణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆమెకు జిల్లాలో స్థానం ఇక అనుమానమేనని, ఇంతకు ముందు  పార్టీ నిర్ణయం మేరకు ఆంధ్రా నుంచి వచ్చి ఖమ్మంలో పోటీ చేసి గెలిచి ఉండొచ్చని,  ఇప్పుడు రాష్ట్ర విభజన అయ్యాక ఆపరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు. అంతేకాక  ఇటీవల ఢిల్లీలో సమైక్య ఎంపీలతో కలిసి ఆమె ఆంటోని కమిటీ ముందుకు వె ళ్లారనే వార్తలు, మరోవైపు ఆ కమిటీని కలిసేందుకు తమతో రానివ్వడానికి  తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారన్న వార్తలు వచ్చిన విషయాన్ని కూడా జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఆమె ఇంకా తాను తెలంగాణ బిడ్డనేనని చెప్పుకోవడం ఎవరిని నమ్మించడం కోసం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఐక్యత ప్రదర్శిస్తున్న జిల్లా నేతలు...

 ఇంతకాలం జిల్లాలో రేణుక ఆధిపత్యాన్ని భరిస్తూ వచ్చిన పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ‘ఇంకానా ఈ పెత్తనం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఖరారయ్యాకా కూడా ఇలాంటివి సహించేది లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా నేతలంతా ఐక్యంగా ఉండాలని కూడా పలువురు అంటుండడం గమనార్హం. దీనికి తగినట్లుగానే జరిగిన సంఘటన కూడా రేణుకకు జిల్లాలో ప్రాధాన్యం తగ్గిపోతోందా అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.  తెలంగాణ ప్రకటన తర్వాత ఈనెల 15న రేణుక జిల్లా పర్యటన ఖరారు చేసుకున్నారు.

ఆ మేరకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తన అనుచరులకు హుకుం జారీచేసినట్లు, స్వాగత కార్యక్రమాలు భారీగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కానీ నాయకులంతా కలిసికట్టుగా వ్యవహరించడంతోనే ఆమె పర్యటన రద్దయినట్లు సమాచారం. తెలంగాణ ప్రకటన వచ్చాక కూడా ఆమెకు ఘనస్వాగతం పలికితే విమర్శలు వస్తాయని నేతలు భావించి ఆమె రాకుండా అడ్డుకున్నారని సమాచారం.  ఇప్పటివరకు రేణుకాచౌదరితో మంచి సంబంధాలున్న నాయకులు సైతం ఇప్పుడు ఆమెకు దూరంగా ఉండాలని, ఆమెను జిల్లాకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుండడం రాజకీయవర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
 
షాకిచ్చిన మంత్రి...
 తెలంగాణ ప్రకటనకు ముందు కాంగ్రెస్ ఖమ్మం పట్టణ కమిటీని రేణుకాచౌదరి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడి ఏర్పాటు చేయించారు. దీంతో ఆగ్రహంతో కుతకుతలాడిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి బొత్సకు లేఖ రాసి ఆ కమిటీని రద్దు చేయించారు. ఇలా  రేణుక చౌదరి ఆధిపత్యానికి గండి కొట్టే కార్యక్రమం మొదలై కొనసాగుతోందనే వాదనను పార్టీ వర్గాలు సైతం తోసిపుచ్చకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement