10 వేల ఉద్యోగాల భర్తీ
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
- పోలీసు శాఖలో 6 వేలు, ఇతర శాఖల్లో 4 వేల పోస్టులు
- పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ
- జూన్ 10 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు
సాక్షి, విజయవాడ బ్యూరో: వివిధ ప్రభుత్వ శాఖల్లో తొలి విడతలో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు శాఖలో 6 వేలు, మిగిలిన శాఖల్లో 4 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఉద్యోగుల బదిలీలను జూన్ 10 నుంచి 20వ తేదీలోపు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం విజయవాడలో నవనిర్మాణ దీక్ష, 8వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో మహా సంకల్ప దీక్ష ద్వారా ప్రజలను చైతన్యపర్చాలని నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీ నిర్ణయాలివీ...
►మొదటి విడతలో 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. పోలీసు శాఖలో 6 వేలు, గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1,000, వైద్య, ఆరోగ్య శాఖలో 422, టెక్నీషియన్లు 1,000, ఇతర ప్రభుత్వ శాఖల్లో 732 పోస్టుల భర్తీ.
►పోలీసు శాఖలో 6 వేల పోస్టుల భర్తీ బాధ్యత పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు, మిగిలిన 4 వేల పోస్టులను భర్తీ చేసే బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగింత.
►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జూన్ 10 నుంచి 20 తేదీలోగా పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలనుత్వరలో రూపొందించాలి.
►13 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ హైస్కూళ్లలో తొమ్మిదో చదువుతున్న 1.80 లక్షల మంది బాలికలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ.
►రాష్ట్రంలో కోటిన్నర మంది అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకం అమలు. ప్రమాదాల్లో మృతి చెందినవారు, శాశ్వతంగా అంగవికలురైన వారికి రూ.5 లక్షలు, పాక్షికంగా అంగవికలురైన వారికి రూ.3.62 లక్షలు, సహజంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.30 వేలు ఈ పథకం కింద ఇవ్వాలని నిర్ణయం. వ్యవసాయ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, కార్మికులు, చేతివృత్తుల వారు దీనివల్ల లబ్ధి పొందుతారు. పాత్రికేయులకూ ఈ పథకం వర్తింపు.
►రాష్ట్రంలోని 1.48 కోటి కుటుంబాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించేందుకు రెండు విడతల్లో స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించాలి. మొదటి విడత సర్వే జూన్ 20 నుంచి 30, రెండో విడత జూలై 5 నుంచి 30వ తేదీ వరకు.
►ఐటీ శాఖ ద్వారా తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు.
►అనంతపురం, విశాఖ, చిత్తూరు జిల్లాల్ల్లో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయం.
►ఏపీ టవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు విషయంలో ఏపీఐఐసీకి పూర్తి అధికారం. ప్రభుత్వ భవనాలపై పీపీపీ విధానంలో టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి.
►ఏపీ పారా మెడికల్ అండ్ అలైడ్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం.
►కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ విజన్(ఉదయ్)ని రాష్ట్రంలో చేపట్టేందుకు అంగీకారం.