ఇదో రకం ‘దారి’దోపిడీ
Published Fri, Jan 17 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :ఒకేగాడిలో.. రుచీ, పసా లేకుండా రసహీనంగా, యాంత్రికంగా సాగే జీవితాలకు కాసింత రంగూరుచీ అద్దే సందర్భాల్లో పండగలు ముఖ్యమైనవి. అందునా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతిది మరీ పెద్దపీట. బతుకుతెరువు కోసం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దూరమైనా, భారమైనా.. తల్లి ఒడిలాంటి తమ సొంత ఊళ్లకు విధిగా వచ్చి, మనవైన పిండివంటలతో పాటు మనవారు అనుకున్న వారి మమతలనూ మనసారా చవి చూసే పండగ ఇది. ఇదిగో.. సరిగ్గా.. ఈ రద్దీనే ఆసరాగా చేసుకుని పంట పండించుకుంటున్నాయి వాహన సంస్థలు. జనానికి జాతర ఉల్లాసం.. జేబులు కొట్టేవాడి కత్తెరకు అవకాశం’ అన్నట్టు.. టిక్కెట్టు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి, ప్రయాణికుల జేబులకు ఇష్టానుసారం చిల్లులు పెడుతున్నాయి. ‘ఆవే చేలో మేస్తుంటే.. దూడ గట్టునుంటుందా?’ అన్నట్టు.. ఆర్టీసీయే నిలువుదోపిడీ సాగిస్తున్న వేళ.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల సంగతి వేరే చెప్పేదేముంది.. పండగ నాలుగురోజులూ పొందిన సంతోషం.. భోగిమంటలో వేసిన నెయ్యి మాదిరి కరిగిపోయేలా రిమ్మ తిరిగే రేట్లు వసూలు చేస్తున్నారు. పండగకు అయిన మొత్తం ఖర్చులో కొత్త దుస్తులు, పిండివంటలు, ఇతర సరదాలకు వెచ్చించిన దాని కన్నా బస్సు టిక్కెట్లకయ్యే వ్యయమే ఎక్కువగా ఉందని సొంత ఊళ్ల నుంచి ఉద్యోగాలు చేసే చోట్లకు తిరుగు ముఖం పట్టిన ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రత్యేక రైళ్లు వేసినా తగ్గని రద్దీ
సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కనుమ పండగ ముగియడంతో గురువారం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు వేసినా ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ దొరక ని వారు, తమ ప్రాంతాలకు రైళ్ల సదుపాయం లేని వారు బస్సులపైనే ఆధారపడ్డారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం అంటూ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ సాధారణ టిక్కెట్ ధరకన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. జిల్లాలోని వివిధ డిపోల నుంచి హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు సుమారు 160 వరకు అదనపు బస్సులు తిప్పుతున్నారు. వీటిలో ఎక్కువ రాజధాని హైదరాబాద్‌కే నడుపుతున్నారు. రాజమండ్రి నుంచి 42 బస్సు సర్వీసులుండగా, అదనంగా 35 సర్వీసులు నడుపుతున్నారు. అమలాపురం నుంచి 10 రెగ్యులర్ బస్సులు ఉండగా, అదనంగా 14, కాకినాడ నుంచి 10 రెగ్యులర్ బస్సులుండగా, అదనంగా మరో ఐదు నడుపుతున్నారు.
బస్సు నిర్వాహకులు కాదు.. ‘బకాసురులు’
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీయే పండగ రద్దీని అడ్డం పెట్టుకుని ఆబగా లాభాలవేటలో పడినప్పుడు.. తాము అంతకన్నా బకాసురులమే అని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిరూపిస్తున్నారు. టిక్కెట్‌లను బ్లాక్ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. సాధారణంగా అమలాపురం నుంచి హైదరాబాద్ టిక్కెట్ ధర రూ.540 కాగా, గురువారం నుంచి శనివారం వరకు రూ.880 చొప్పున టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఆదివారం అయితే ఇప్పటికే రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు.
చాలా ట్రావెల్స్ యజమానులు ‘ఆదివారం నాటి సర్వీసులకు టిక్కెట్లు అయిపోయాయి’ అంటూ అమ్మకాలు నిలిపివేశారు. వాస్తవానికి టిక్కెట్లు ఉన్నా ఆదివారం ఉదయం గిరాకీని బట్టి రూ.1,500 వరకు అమ్ముకునేందుకే ఈ ఎత్తుగడ. కాగా పాలెం బస్సు దుర్ఘటన తరువాత రవాణా శాఖ దాడుల నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు ఎక్కువ సర్వీసులను నడిపేందుకు వెనుకడుగు వేయడంతో వల్ల బస్సుల సంఖ్య తగ్గి టిక్కెట్ ధరలు పెరిగాయని ట్రావెల్స్ యజమానులు సమర్థించుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ ఇంటికి తాళం వేసుకుని ఊరెళితే.. అదే అదనుగా దొంగలు ఏ రాత్రో కొంప కొల్లగొడతారని, పిల్లాపాపలతో పండగకు వచ్చిన పాపానికి అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు పట్టపగలే నిలువుదోపిడీ చేస్తున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. వారి గోడు ఆలకించి, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసే పూనిక ప్రభుత్వ యంత్రాంగంలో కలికానికి కూడా కానరావడం లేదు.
ఎక్కడ నుంచి.. రెగ్యులర్ బస్సు చార్జి ప్రత్యేక బస్సుచార్జి
(హైదరాబాద్‌కు రూ.లలో) (హైదరాబాద్‌కు రూ.లలో)
అమలాపురం 494.00 741.00
రాజమండ్రి 474.00 711.00
కాకినాడ 508.00 762.00
Advertisement
Advertisement