ఏజెన్సీని వణికిస్తున్న చలి
=ఏజెన్సీని వణికిస్తున్న చలి
=కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
=దట్టంగా కమ్మేస్తున్న మంచు
=మన్యం వాసులు గజగజ
చింతపల్లి/పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో చలి పులి పంజావిసురుతోంది. ఆదివాసీలను వణికిస్తోంది. ఉదయం, రాత్రివేళల్లో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అనూహ్యంగా ఒక్క రోజు వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు దారుణం గా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకే అస్తమించిన సూర్యుడు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కూడా కనిపించలేదు. ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి అధికంగా ఉంటుంది. అటువంటిది ఈ ఏడాది నవంబర్ మొదటి వారం నుంచే చలిపులి గాండ్రిస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే శీతలగాలులు వీస్తున్నాయి.
పాడేరు ఘాట్‌రోడ్డులోని మోదమాంబ పాదాలు వద్ద అత్యల్పంగా 3 డి గ్రీలు, చింతపల్లి మండలం లంబసింగిలో 4, పాడేరు మండలం మినుములూరులో 5, చింతపల్లి మండల కేంద్రంలో 7 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంత తక్కువ ఉష్ణోగ్రతలుండటం ఇదే తొలిసారి. చలితో పాటు దట్టంగా మంచు కురవడంతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయాన్నే వ్యవసాయ పనులకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారపు సంతలకు వేకువ జామున కాలినడకన వ్యవసాయోత్పత్తులను తరలించే గిరిజనులు చలితో నరకయాతన పడుతున్నారు.
గూడేల్లో ఎక్కడికక్కడ నెగడులు, చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. సముద్ర మట్టానికి సుమారు నాలుగువేల అడుగుల ఎత్తులో ఉన్న అనంతగిరి, పాడేరు మండలం డల్లాపల్లి, చింతపల్లి, పెదవలస, లంబసింగి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు కొత్తగా వచ్చే కొందరు వింత అనుభూతికి లోనవుతుండగా, మరి కొందరు చలికి తాళలేకపోతున్నారు. ఘాట్‌లో ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే గిరిజనులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు రక్షణ చర్యలు తీసుకోవాలని చింతపల్లి వైద్యాధికారి శర్మ తెలిపారు. దట్టంగా కురుస్తున్న మంచుతో చిన్నారులు శ్వాసకోశ వ్యాధులకు గురికాకుండా ఉన్ని దుస్తులు విధిగా ధరించాలని సూచించారు.
మరింత పెరిగే అవకాశం
రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్త పి.ప్రదీప్‌కుమార్ తెలిపారు. దట్టమైన అడవులు కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతుంటాయని, శీతాకాలంలో మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావంతో కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.