క్షణ..క్షణం.. భయం.. భయం | Residents went to Libya for employment cement nagar | Sakshi
Sakshi News home page

క్షణ..క్షణం.. భయం.. భయం

Published Tue, Jul 29 2014 2:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

క్షణ..క్షణం.. భయం.. భయం - Sakshi

క్షణ..క్షణం.. భయం.. భయం

ఉన్న ఊరిలో ఉపాధి కరువై..

ప్రమాదంలో వలస బతుకులు
ఉపాధి కోసం లిబియా వెళ్లిన సిమెంట్‌నగర్ వాసులు
అంతర్యుద్ధంతో బయటికి రాలేకపోతున్న వైనం
సిమెంట్ ప్లాంట్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత
చీకట్లో అన్నం లేక అలమటిస్తున్న కార్మికులు
ఆందోళన చెందుతున్న బాధిత కుటుంబ సభ్యులు
ఆదుకోవాలని అధికారులకు విన్నపం
 సాక్షి, కర్నూలు/బేతంచెర్ల : ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. రెండేళ్ల కిందట బతుకుదెరువు వెతుక్కుని ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశానికి వలస వె ళ్లిన జిల్లాలోని సిమెంట్‌నగర్‌కు చెందిన సుమారు 35 మంది యువకులు ప్రస్తుతం ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

రెండేళ్లుగా ఫోన్లలోనే ఆత్మీయులను పలకరిస్తూ.. క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ.. ఇక ఊరికి రావడానికి సిద్ధమవుతున్న వేళ.. యుద్ధం మబ్బులు కమ్ముకున్నాయి. బయటికి రాలేని పరిస్థితి నెలకొనడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కన్నవారి గుండెల్లో ఆందోళన మొదలైంది. తమను సొంతూరికి చేర్చడానికి పాలకులు చర్యలు తీసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు సిమెంట్‌నగర్ వాసులు.
 
సిమెంట్ రంగంలో నిపుణులైన బేతంచెర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన 50 మంది యువకులు లిబియాలోని సిమెంట్ పరిశ్రమల్లో పనిచేయడానికి రెండేళ్ల ఒప్పందం మీద 2012లో వెళ్లారు. ఇటీవలే 15 మంది కార్మికులు ఒప్పందం ముగియడంతో తిరిగి సిమెంట్‌నగర్‌కు వచ్చారు. మరికొందరి ఒప్పందం ఇటీవలే ముగిసింది. ఇక త్వరలో స్వస్థలానికి వెళతామనే ఆనందంలో ఉన్న వారికి ఆటంకం ఎదురైంది. అంతర్యుద్ధం వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుసుకున్న కార్మికుల్లో ఆందోళన నెలకొంది.

రోజురోజుకు యుద్ధం తీవ్రం కావడంతో ఇటీవలే వారుంటున్న ఓ ప్లాంట్‌లో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారు చీకటిలో మగ్గుతున్నారు. రెండు రోజులుగా ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాలను ఫోన్ల ద్వారా తెలుసుకున్న బాధిత యువకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని వేడుకొంటున్నారు. భయానక వాతావరణంలో చిక్కుకున్న తమ వారిని రక్షించి, సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బేతంచెర్ల తహశీల్దారు రామకృష్ణుడు, సీఐ సుబ్రమణ్యం సిమెంట్‌నగర్‌కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారి ద్వారా వారి పిల్లలతో ఫోన్‌లో మాట్లాడి వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడ మీ వారు క్షేమంగా ఉన్నారని.. వారి విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
 
వారికి తెలిసిన పని అదొక్కటే..
జిల్లాలో ఒకప్పుడు సిమెంట్‌నగర్ అంటే పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీనే గుర్తొచ్చేది. ఆ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అయితే ఆ ఫ్యాక్టరీ నిర్వహణలో స్థిరత్వం లేకపోవడంతో పలుమార్లు మూసివేయడం.. మళ్లీ ప్రారంభించడం జరుగుతోంది. ఇలా మూసివేసిన ప్రతిసారి ఉపాధి కరువై అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి తెలిసిన వృత్తి అదొక్కటే కావడంతో వారు పొట్టచేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. గత ఎనిమిది నెలలుగా మూతపడ్డ పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని ఐదు రోజుల క్రితం మళ్లీ ప్రారంభించారు.
 
అందరూ యువకులే..
లిబియాలోని ఏసీసీ, ఏయూసీసీ కంపెనీల్లో పనిచేసేందుకు సిమెంట్‌నగర్ నుంచి వెళ్లిన వారంతా 20 నుంచి 32 ఏళ్ల మధ్య యువకులే. ఢిల్లీకి చెందిన ఎస్‌ఎస్‌బీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సహకారంతో వీరు జూనియర్ ఇంజనీర్లు, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, మిల్లర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి రెండేళ్ల ఒప్పందం మీద 2012 జూలై, ఆగస్టు నెలల్లో లిబియాకు వెళ్లారు. ప్రస్తుతం  వారున్న ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే యుద్ధం జరుగుతోంది. ప్లాంట్లను వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి  నెలకొనడంతో గత కొన్ని రోజులుగా వారు అక్కడే ఉంటున్నారు.
 
ఆకాశమా, సముద్ర మార్గమా..?

లిబియాలో చిక్కుకున్న సిమెంట్‌నగర్ వాసులు సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు అక్కడి యాజమాన్యాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలిసింది. అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అక్కడికి సమీపంలో  ఎయిర్‌పోర్టు లేకపోవడం.. ఒకవేళ రహదారి మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవేళ వారు సముద్రమార్గం ద్వారా ప్రయాణిస్తే కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం 14 రోజులపాటు సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కాగా, వీరుంటున్న ప్రాంతానికి సముద్రం కూడా చాలా దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఒప్పందం ముగిసి 9 రోజులైంది..
లిబియాలోని ఓ సిమెంట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్ పనికి వెళ్లిన గంగారం రాజేష్ ఒప్పందం ఈ నెల 20వ తేదీతో ముగిసిందని అతని తల్లి లక్ష్మీదేవి పేర్కొంది. ప్రతి రెండు నెలలకోసారి జీతం డబ్బులు (చెక్కులు) పంపేవాడని. కానీ అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా సంబంధిత యాజమాన్యం స్వదేశానికి పంపుతుందా లేదా అన్న సందేహం వ్యక్తం చేశాడని ఆమె ఆవేదన చెందుతోంది. తమ పిల్లల్ని సురక్షితంగా ఇక్కడి రప్పించే ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టాలని కోరుతోంది.  
 
ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు
తన కుమారుడు యశ్వంత్ 2012 ఆగస్టు 6వ తేదీన జూనియర్ ఇంజినీర్‌గా లిబియా సిమెంట్ కంపెనీలో చేరాడని అతని తల్లి సుశీల తెలిపింది. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులను చూస్తుంటే భయం వేస్తోందని.. ప్రస్తుతం తన కుమారుడు పనిచేసే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు ఫోన్‌లో తెలిపాడని వివరించింది.  కొన్ని రోజులుగా వేతనాలకు చెందిన చెక్కులు కూడా రావడం లేదని, అక్కడ మా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరింది.
 
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
లిబియా వెళ్లిన తమ పిల్లలు ఏం కష్టాలు పడుతున్నారో తెలియదని, కనుక ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని సుధీర్ తల్లి కళావతి కోరుతోంది.
 
సిమెంట్‌నగర్ వాసుల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం
లిబియాలో చిక్కుకున్న సిమెంట్‌నగర్ వాసుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. లిబియాలో ఉన్న కార్మికులతో మాట్లాడాం. వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్ల ఒప్పందపై 50 మంది అక్కడి వెళ్లినట్లు తెలిసింది. వారిలో 15 మంది ఇటీవలే తిరిగొచ్చారు. మిగిలిన వారిలో వివరాలు, ఫోన్ నంబర్లను సేకరించి సీఎం కార్యాలయానికి పంపాం. అలాగే ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకు, విపత్తుల కమిషనర్‌కు ఓ సమగ్ర నివేదిక పంపి వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాం.
 - సీహెచ్ విజయమోహన్, కలెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement