ఏయూక్యాంపస్, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని ఈనెల 30లోగా పదవులకు రాజీనామాలుచేసి ఆమోదింపచేసుకుని ఉద్యమంలోకి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద్ డిమాండ్‌చేశారు. వర్సిటీలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, పి.సి.చాకోలు తెలంగాణ ఏర్పాటుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయని పక్షంలో వారిని అడ్డుకుంటామని. వారిపై దాడులు చేయడానికి సైతం వెనకాడమని హెచ్చరించారు. 54 రోజులుగా సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం చూసైనా ప్రజాప్రతినిధులు కదలి రాకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.
యువజన,విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ జీవితాలు, జీతాలు పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. రాచరిక వ్యవస్థను తలపించేవిధంగా దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. హైదరాబాదును యూటీగా మార్చడం వల్ల ఇరు ప్రాంతాలకు ఒరిగే ప్రయోజనం శూన్యమని, దీనిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు బి.కాంతారావు, బి.మోహన్‌బాబు, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.