samaikyandhra students jac
-
కేసీఆర్‌కు ఇంటి వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వారిని లోనికి వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. తాము కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సమైక్యాంధ్రకు మద్దతు కోరడానికి వచ్చామని జేఏసీ నేతలు చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. -
కదం తొక్కిన విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్ర విభజన వద్దని నెలల తరబడి ఉద్యమిస్తున్నా, కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలు దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తునాయని ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుకు నిరసనగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి వేలాది మంది హిందూ కళాశాల సెంటర్‌కు ర్యాలీగా చేరుకొని, అక్కడ నడిరోడ్డుపై బైఠాయించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనను పెడచెవిన పెట్టిన కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నం ద్వారా దేశ చరిత్రలో ఎన్నడూ జరుగని పరిణామాలకు కారణమైందన్నారు. చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయించి, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ చేయించిన దాడిని, వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రజాకాంక్ష పట్టని ఢిల్లీ పెద్దలకు జీవితంలో మరచిపోలేని గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు మాట్లాడుతూ సిగ్గులేని విభజన వాదులు ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ ముసుగులో రాజకీయ దోపిడీకి శ్రీకారం చుట్టారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్ మాట్లాడుతూ కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని చేతకాని ప్రభుత్వాలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా, నీతిలేని పాలకుల మనసు మార్చలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. నిరసన ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోయి సుబ్బారావు, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జేఏసీ నాయకులు జెట్టి ఝాన్సీరాణి, అడపా బాబు, సౌపాటి రత్నం, పవన్ తేజ, చిగురుపాటి అనూప్, కొడాలి శ్రీనివాస్, చల్లా రవీంద్ర, చలపతి ఇంజినీరింగ్, ఫార్మశీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ముట్టడి యత్నం భగ్నం
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల అరెస్టు హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మాసబ్‌ట్యాంక్ నుంచి అయోధ్యా జంక్షన్ మీదు గా అసెంబ్లీ వద్దకు వెళుతున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తోపాటు మరో 40 మంది నిరసనకారులను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ సమావేశం పూర్తయిన అనంతరం వారిని విడిచిపెట్టారు. తెలంగాణ బిల్లు చట్టబద్ధమైనది కాదని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుపై అసెంబ్లీలో డ్రామాలాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జేఏసీ నాయకులు కార్తీక్, రవి, డేవిడ్, ప్రభాకర్‌రెడ్డి, ఉత్తన్న, పి.శ్రీను, ఓబన్న, యశ్వంత్, నాగార్జున తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మ నిమజ్జనం
కవాడిగూడ, న్యూస్‌లైన్: కేంద్ర కేబినెట్లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియకు ఆమోదించినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రుల దిష్టిబొమ్మను, వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసింది. జేఏసీ అధ్యక్షులు ఆధారి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సీమాంధ్ర, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు దిష్టిబొమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ సంద్బంగా కిషోర్ మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను విడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమన్నారు. ఇందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోపాయికారీగా అంగీకారం తెలుపుతూ సీమాంధ్ర ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
30లోగా రాజీనామాలు ఆమోదింపజేసుకోండి
ఏయూక్యాంపస్, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని ఈనెల 30లోగా పదవులకు రాజీనామాలుచేసి ఆమోదింపచేసుకుని ఉద్యమంలోకి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద్ డిమాండ్‌చేశారు. వర్సిటీలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, పి.సి.చాకోలు తెలంగాణ ఏర్పాటుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయని పక్షంలో వారిని అడ్డుకుంటామని. వారిపై దాడులు చేయడానికి సైతం వెనకాడమని హెచ్చరించారు. 54 రోజులుగా సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం చూసైనా ప్రజాప్రతినిధులు కదలి రాకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. యువజన,విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ జీవితాలు, జీతాలు పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. రాచరిక వ్యవస్థను తలపించేవిధంగా దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. హైదరాబాదును యూటీగా మార్చడం వల్ల ఇరు ప్రాంతాలకు ఒరిగే ప్రయోజనం శూన్యమని, దీనిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు బి.కాంతారావు, బి.మోహన్‌బాబు, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.