కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియకు ఆమోదించినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రుల దిష్టిబొమ్మను, వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసింది.
కవాడిగూడ, న్యూస్‌లైన్:
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియకు ఆమోదించినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రుల దిష్టిబొమ్మను, వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసింది. జేఏసీ అధ్యక్షులు ఆధారి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సీమాంధ్ర, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు దిష్టిబొమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.
ఈ సంద్బంగా కిషోర్ మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను విడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమన్నారు. ఇందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోపాయికారీగా అంగీకారం తెలుపుతూ సీమాంధ్ర ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.