
అసెంబ్లీ ముట్టడి యత్నం భగ్నం
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల అరెస్టు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మాసబ్‌ట్యాంక్ నుంచి అయోధ్యా జంక్షన్ మీదు గా అసెంబ్లీ వద్దకు వెళుతున్న విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తోపాటు మరో 40 మంది నిరసనకారులను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ సమావేశం పూర్తయిన అనంతరం వారిని విడిచిపెట్టారు. తెలంగాణ బిల్లు చట్టబద్ధమైనది కాదని ఈ సందర్భంగా కృష్ణయాదవ్ పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుపై అసెంబ్లీలో డ్రామాలాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జేఏసీ నాయకులు కార్తీక్, రవి, డేవిడ్, ప్రభాకర్‌రెడ్డి, ఉత్తన్న, పి.శ్రీను, ఓబన్న, యశ్వంత్, నాగార్జున తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.