గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో విద్యార్థులు కదం తొక్కారు. రాష్ట్ర విభజన వద్దని నెలల తరబడి ఉద్యమిస్తున్నా, కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలు దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తునాయని ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుకు నిరసనగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం నుంచి వేలాది మంది హిందూ కళాశాల సెంటర్‌కు ర్యాలీగా చేరుకొని, అక్కడ నడిరోడ్డుపై బైఠాయించారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనను పెడచెవిన పెట్టిన కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నం ద్వారా దేశ చరిత్రలో ఎన్నడూ జరుగని పరిణామాలకు కారణమైందన్నారు.
చలపతి విద్యాసంస్థల అధినేత వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయించి, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ చేయించిన దాడిని, వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రజాకాంక్ష పట్టని ఢిల్లీ పెద్దలకు జీవితంలో మరచిపోలేని గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు మాట్లాడుతూ సిగ్గులేని విభజన వాదులు ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ ముసుగులో రాజకీయ దోపిడీకి శ్రీకారం చుట్టారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్ మాట్లాడుతూ కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని చేతకాని ప్రభుత్వాలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా, నీతిలేని పాలకుల మనసు మార్చలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడబోమని చెప్పారు. నిరసన ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోయి సుబ్బారావు, విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జేఏసీ నాయకులు జెట్టి ఝాన్సీరాణి, అడపా బాబు, సౌపాటి రత్నం, పవన్ తేజ, చిగురుపాటి అనూప్, కొడాలి శ్రీనివాస్, చల్లా రవీంద్ర, చలపతి ఇంజినీరింగ్, ఫార్మశీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన విద్యార్థులు
Published Sun, Feb 16 2014 3:01 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement